బజార్‌ఘాట్ అగ్ని ప్రమాదంపై చర్యలేవి?
హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్ అగ్ని ప్రమాద బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది

* పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి
* ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్ అగ్ని ప్రమాద బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది. బజార్‌ఘాట్‌లో వ్యాపారి, బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేశ్ జైశ్వాల్ ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాల విక్రయాలు చేస్తున్నారు. నాంపల్లి రెడ్‌హిల్స్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన, సమీపంలోని బాలాజీ రెసిడెన్సీలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను గోదాముగా మార్చి రసాయన డ్రమ్ములు, ముడి సరుకు నిల్వ చేస్తున్నారు.
నాలుగు అంతస్తులను నివాస గృహాలుగా 9 కుటుంబాలకు అద్దెకు ఇచ్చారు. నవంబర్ 13న ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పు రవ్వలు పడి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు రసాయన డ్రమ్ములకు వ్యాపించడంతో అవి పేలాయి. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కూడా పేలింది. భవనంలోని కుటుంబాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో రమేశ్ జైశ్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టుకు లేఖ అందింది.
దీన్ని సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, అగ్నిమాపక డీజీ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, జోనల్ కమిషనర్, నాంపల్లి ఎస్‌హెచ్‌ఓకు నోటీసులు జారీ చేసింది.