మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస‌

కొన్నాళ్లుగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో అట్టుడికిపోతున్న‌ మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. ఇటీవ‌ల‌ క‌నిపించ‌కుండా పోయిన మైతీ వ‌ర్గానికి చెందిన నలుగురు రైతుల్లో

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస‌
  • ఇటీవ‌ల అదృశ్య‌మైన న‌లుగురు రైతుల్లో ముగ్గురు మృతి
  • మైతీ రైతుల మృతదేహాలకు బుల్లెట్, కోతల‌ గాయాలు
  • ఇంకా ఒక‌రి గురించి ల‌భించ‌ని ఆచూకీ.. పోలీసుల గాలింపు

విధాత‌: కొన్నాళ్లుగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో అట్టుడికిపోతున్న‌ మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. ఇటీవ‌ల‌ క‌నిపించ‌కుండా పోయిన మైతీ వ‌ర్గానికి చెందిన నలుగురు రైతుల్లో ముగ్గురు హ‌త్య‌కు గుర‌య్యారు. వారి మృత‌దేహాలు బిష్ణుపూర్ జిల్లాలో గురువారం ల‌భించాయి. మృత‌దేహాల‌పై బుల్లెట్‌తోపాటు క‌త్తితో కోసిన‌ట్టు గాయాలు ఉన్నాయి. అదృశ్య‌మైన రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బిష్ణుపూర్ -చురచంద్‌పూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న హౌటక్ ఫైలెన్ ప్రాంతంలో కట్టెలు సేకరించేందుకు బుధ‌వారం వెళ్లిన న‌లుగురు రైతులు కనిపించకుండా పోయారు. వారి కోసం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో గాలించిన‌ప్ప‌టికీ వారి ఆచూకీ ల‌భించ‌లేదు. నలుగురు రైతుల్లో ముగ్గురి మృత‌దేహాలు గురువారం బిష్ణుపూర్‌లో ల‌భించాయి. మృతుల‌ను తౌడమ్ ఇబోమ్చా (53), ఓయినమ్ రోమెన్ (45), తౌడం ఆనంద్ (27) గా గుర్తించారు. వీరు బిష్ణుపూర్ జిల్లాలోని టెరాఖోంగ్ అకాసోయ్ ప్రాంతానికి చెందిన‌వారు. గురువారం ఉదయం వారి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

బిష్ణుపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు తరలిస్తున్నట్టు స్థానికులు పేర్కొన్నారు. గల్లంతైన నాలుగో వ్యక్తి అహంతేం దారా ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

బిష్ణుపూర్-చురచంద్‌పూర్ సరిహద్దులో బుధవారం కాల్పులు జరిగినట్లు సమాచారం. దుర్బల ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌లలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత మైతీలు, కుకీల మధ్య జాతి హింస చెలరేగడంతో మే 3 నుంచి రాష్ట్రంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకు దాదాపు 200 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు.