భార్య ఐదో వివాహం చేసుకుంద‌ని.. నాలుగో భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

ఆమె నిత్య పెళ్లి కూతురు.. ఒక‌ట్రెండు పెళ్లిళ్లు కాదు.. ఏకంగా ఐదుగురిని పెళ్లాడింది. నాలుగో భ‌ర్త మీద వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టి, ముప్పుతిప్ప‌లు పెట్టింది

భార్య ఐదో వివాహం చేసుకుంద‌ని.. నాలుగో భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

భోపాల్ : ఆమె నిత్య పెళ్లి కూతురు.. ఒక‌ట్రెండు పెళ్లిళ్లు కాదు.. ఏకంగా ఐదుగురిని పెళ్లాడింది. నాలుగో భ‌ర్త మీద వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టి, ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఆ త‌ర్వాత ఐదో పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన నాలుగో భ‌ర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన ఓ మ‌హిళ 2018లో సునీల్ లోహ‌ని అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. సునీల్ ఆమెకు నాలుగో భ‌ర్త‌. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య గ‌తేడాది కాలం నుంచి గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. సునీల్ త‌న‌ను వ‌ర‌క‌ట్నం కోసం వేధిస్తున్నాడ‌ని కేసు పెట్టింది. దీంతో సునీల్ కోర్టు చుట్టూ తిరిగాడు. ఈ క్ర‌మంలోనే ఆమె ఐదో వివాహం చేసుకుంది.

ఈ ప‌రిణామాల‌ను త‌ట్టుకోలేని సునీల్ గ‌త వారం ఇంట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల‌పాలైన సునీల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. సునీల్ కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.