పోలీసుల క‌ళ్లుగ‌ప్పి.. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీని ఎస్కేప్ చేసిన భార్య‌

ఓ మ‌హిళ పెద్ద సాహ‌స‌మే చేసింది. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా శిక్ష పొందుతున్న త‌న భ‌ర్త‌ను పోలీసుల ప‌హారా నుంచి త‌ప్పించింది

పోలీసుల క‌ళ్లుగ‌ప్పి.. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీని ఎస్కేప్ చేసిన భార్య‌

చండీఘ‌ర్ : ఓ మ‌హిళ పెద్ద సాహ‌స‌మే చేసింది. అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా శిక్ష పొందుతున్న త‌న భ‌ర్త‌ను పోలీసుల ప‌హారా నుంచి త‌ప్పించింది. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి భ‌ర్త‌ను స్కూటీపై తీసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న హ‌ర్య‌నాలో వెలుగు చూసింది. 

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్యానా పాల్వాల్ జిల్లాలోని హోడ‌ల్‌కు చెందిన అనిల్‌పై క‌నీసం ఎనిమిది క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం అత‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర జైల్లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్నాడు. 

అయితే హ‌త్యాయ‌త్నం కేసులో అనిల్‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచేందుకు న‌లుగురు పోలీసుల బృందం హ‌ర్యానా కోర్టుకు త‌ర‌లించింది. అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఇద్ద‌రు కానిస్టేబుల్స్ అనిల్‌కు కాప‌లాగా ఉన్నారు. అయితే అనిల్‌ను కోర్టుకు త‌ర‌లిస్తున్న విష‌యం అత‌ని భార్య‌కు తెలిసింది. దీంతో త‌న స్కూటీపై కోర్టు స‌మీపంలోకి వ‌చ్చింది. 

అక్క‌డ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన ఆమె భ‌ర్త అనిల్‌ను ఎస్కేప్ చేసింది. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి భ‌ర్త‌ను స్కూటీపై ఎక్కించుకుని ప‌రార్ అయింది. అనిల్ క‌నిపించ‌క‌పోయేస‌రికి పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఈ ముగ్గురి పోలీసులపై ఉన్న‌తాధికారులు సీరియ‌స్ అయ్యారు. 

అనిల్‌తో పాటు ఆయ‌న భార్య ఆచూకీ క‌నుగొనేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్, ఇద్ద‌రు కానిస్టేబుల్స్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.