మ‌హిళ‌పై మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు లైంగిక‌దాడి.. 4 తులాల బంగారం చోరీ

  • By: Somu    crime    Oct 23, 2023 11:09 AM IST
మ‌హిళ‌పై మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు లైంగిక‌దాడి.. 4 తులాల బంగారం చోరీ

విధాత‌: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళలు.. మరో మహిళపై లైంగిక‌దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటన హైద‌రాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ష్టేషన్‌ పరిధిలో జరిగింది.


మ‌ధురాన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలోని హ్మత్‌నగర్‌ డివిజన్‌కు చెందిన ఓ వివాహిత మహిళ (38) త‌న భ‌ర్త‌తో గొడ‌వ ప‌డింది. దీంతో ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఆమె ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక యూసుఫ్‌గూడ బ‌స్టాప్ వ‌ద్ద నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తుండ‌గా, ఆమెను గ‌మ‌నించిన ఇద్ద‌రు మ‌హిళ‌లు, అక్క‌డికి చేరుకున్నారు. వివాహిత‌ను ఆప్యాయంగా ప‌లుక‌రించి, మాట‌లు క‌లిపారు. మా ఇల్లు ప‌క్క‌నే ఉంది.. అక్క‌డ ప‌డుకొని, ఉద‌యాన్నే లేచిపొమ్మ‌ని ఆమెకు వారు చెప్పారు. దీంతో వారి మాట‌లు న‌మ్మిన ఆ మ‌హిళ‌, బ్ర‌హ్మశంక‌ర్ న‌గ‌ర్‌లోని ఆ మ‌హిళ‌ల ఇంటికి వెళ్లింది.


ఇక ఆ రోజు రాత్రి ఆమెకు కూల్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చారు. మ‌త్తులోకి జారుకున్న బాధితురాలి బ‌ట్ట‌లు విప్పేసి, లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. గోళ్ల‌తో శ‌రీర‌మంతా ర‌క్కి పైశాచిక ఆనందం పొందారు. అనంత‌రం బాధితురాలి మెడ‌లో ఉన్న నాలుగు తులాల బంగారం గొలుసు, చెవిదుద్దిళ్ల‌ను తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెను అక్క‌డ్నుంచి పంపించేశారు.


అక్క‌డ్నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బాధితురాలు త‌న భ‌ర్త వ‌ద్ద‌కు చేరుకుని జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి మ‌ధురాన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కల్లు కంపౌండ్‌ అడ్డాగా ఇద్దరు మహిళలు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మ‌హిళ‌లు ఇద్ద‌రు అసహజమైన శృంగారానికి అలవాటు పడటంతో పాటు దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.