వెలిగిన 108-అడుగుల అగరబత్తి.. 50 కిలోమీటర్ల దూరం వరకు సువాసన
దేశవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణం వచ్చేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి

అగరబత్తి బరువు 3,610 కిలోలు
విధాత: దేశవ్యాప్తంగా హిందువులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణం వచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు మంగళవారం అట్టహాసంగా మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మంగళవారం 108 అడుగుల పొడవాటి ధూపదీపాన్ని అగరబత్తిని వెలిగించారు. జై శ్రీ రామ్ అని నినాదాలు చేస్తూ భక్తజన సందోహం మధ్య శ్రీ దాస్ ధూపం వెలిగించారు.
అగరబత్తి నుంచి వచ్చే సువాసన 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుతుందని ఆయన తెలిపారు. 3,610 కిలోల బరువున్న అగరబత్తి సుమారు మూడున్నర అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది గుజరాత్‌లోని వడోదర నుంచి అయోధ్య పట్టణానికి తీసుకొచ్చారు. ఆవు పేడ, నెయ్యి, పూల పదార్థాలు, మూలికలను ఉపయోగించి అగరబత్తిని తయారు చేశారు. ఒకసారి వెలిగిస్తే దాదాపు నెలన్నరపాటు ధూపం వెలుగుతూ ఉంటుంది.