Tirumala | రేపటి నుంచి తిరుమల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నవంబర్ నెలకు సంబంధించిన పలు ఆర్జిత సేవల టికెట్లను నేడు సోమవారం నుంచి విడుదల చేస్తోంది.

24న ప్రత్యేక దర్శన టికెట్ల కోటా జారీ
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నవంబర్ నెలకు సంబంధించిన పలు ఆర్జిత సేవల టికెట్లను నేడు సోమవారం నుంచి విడుదల చేస్తోంది. నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం.. 21వ తేదీ ఉదయం 10 గంటల దాకా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు దక్కించుకున్న వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించాలి. వారికే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న కల్యాణోత్సవం టికెట్లు..
ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. అదేవిధంగా.. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవ టికెట్లను కూడా విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
23న అంగప్రదక్షిణ టోకెన్లు..
నవంబరు కోటా అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. అదేవిధంగా.. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
నవంబర్ కు సంబంధించిన శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు(రూ.300)లను 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా తిరుపతి, తిరుమలలో గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు.
27న శ్రీవారి సేవ కోటా..
శ్రీవారి సేవ కోటా టికెట్లను 27వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. అదేవిధంగా.. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని కోరారు.