Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సూర్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది జికె విష్ణు అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ ఫీస్ట్‌గా మలచిన ఆయన పనితనంపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జికె విష్ణు ప్రతిభకు గుర్తింపుగా హీరో సూర్య ప్రత్యేక బహుమతిని అందించారు.సూర్య తన సినిమాటోగ్రాఫర్‌కు అత్యంత ఖరీదైన ‘మహీంద్రా BE6 బ్యాట్‌మాన్ ఎడిషన్’ కారును కానుకగా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను అందుకున్న జికె విష్ణు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కొత్త కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సూర్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
“సూర్య సర్‌కు పెద్ద మనసు ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ జికె విష్ణు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినిమా విజయాన్ని తన సొంత విజయంగా కాకుండా మొత్తం టీమ్ కృషిగా భావించే సూర్య, గతంలో కూడా తన సహచరులకు బహుమతులు అందించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ‘కరుప్పు’ విజయంలో కీలక పాత్ర పోషించిన జికె విష్ణును ప్రత్యేకంగా సత్కరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ‘కరుప్పు’ విజయంతో సూర్య కెరీర్ మరోసారి పీక్‌కు చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.