ఎర్ర చీమల ఎలర్జీ నిర్ధారణ: దేశంలో హైదరాబాద్ లోనే మొదటి సారి పరీక్ష
ప్రాణాంతకంగా మారిన (అనఫలాక్సి) ఎర్ర చీమల ఎలర్జీ నిర్ధారణ పరీక్షల్లో హైదరాబాద్ లోని అశ్విని ఎలర్జీ సెంటర్ విజయం సాధించింది

- అశ్విని ఎలర్జీ సెంటర్ ఘనత
- బాధితుడికి అలర్జున్ సిఫిక్ ఇమ్యునో థెరపీ చికిత్స
విధాత, హైదరాబాద్: ప్రాణాంతకంగా మారిన (అనఫలాక్సి) ఎర్ర చీమల ఎలర్జీ నిర్ధారణ పరీక్షల్లో హైదరాబాద్ లోని అశ్విని ఎలర్జీ సెంటర్ విజయం సాధించింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పరీక్షను నిర్వహించిన ఘనతను సంపాదించింది. రోగి ఎలర్జీ పరీక్షల వివరాలను పరిగణలో తీసుకొని, అలర్జీ రోగులకు అత్యాధునికమైన అలర్జున్ సిఫిక్ ఇమ్యునో థెరపీ చికిత్స విధానాన్ని అందిస్తున్నారు. వైద్యలు వెల్లడించిన వివరాలివి. 28 సంవత్సరాల ఐటీ ఉద్యోగి ఇంటి వద్ద మొక్కల పని చేస్తున్నప్పుడు, పదుల సంఖ్యలో కాలుకు చీమలు కుట్టాయి.
సరిగ్గా 30 నిమిషాలు కాగానే కంటి దురద, గొంతు దురద, చర్మం మీద దద్దుర్లు, దురదలు, గొంతులో మాట మారడం, కొద్దిగా శ్వాస ఇబ్బంది, పెదిమలు- చెవి వాచిపోవడం, మైకం లాగా రావడం, బీపీ సడన్గా తగ్గినట్టు అనిపించడం వంటి లక్షణాలు ఎదుర్కొన్నాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు, 24 గంటల పాటు ఐసీయూలో అడ్మిట్ చేసి, శ్వాస ప్రక్రియ, మైకం, దద్దుర్లు తక్కువ అయినంతవరకు ఉంచి డిస్చార్జ్ చేసి పంపారు. ఈక్రమంలో 20 రోజులు అనంతరం ఇంట్లో పుస్తకాలు సర్దుతున్న బాధితుడికి అక్కడున్న చీమలు మరోసారి కుట్టాయి.
ఈసారి కూడా పాత లక్షణాలే బయటపడడంతో భయబ్రాంతులకు గురైన సభ్యులు, హైదరాబాదులోని అశ్విని ఎలర్జీ సెంటర్కి తీసుకు వచ్చారు. అలర్జీ ఇమ్యునాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ రోగి లక్షణాలు పరిశీలించారు. అనంతరం మాడిఫైడ్ అలర్జీ స్కిన్ ప్రీక్ టెస్ట్ నిర్వహించారు. సాధారణంగా పాజిటివ్ రావలసిన ఎలర్జీలు ఏవీ కూడా రోగికి కనపడక పోవడంతో డాక్టర్ రోగి లక్షణాలను, రోగి అనుభవాన్ని పరిగణలో తీసుకొని ‘ఎర్ర చీమలు – నల్ల చీమల’ ఎలర్జీ టెస్టింగ్ నిర్వహించారు. సాధారణంగా ఎర్ర చీమలు, నల్ల చీమల ఎలర్జీ టెస్టింగ్ భారతదేశంలో చేయడం చాలా అరుదు.
రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలు నిర్వహించారు డాక్టర్ వ్యాకరణం. ఈ పరీక్షల్లో హీష్టమైన : 8, ఎర్ర చీమలకి ఎలర్జీ టెస్టింగ్ : పాజిటివ్ – 6, నల్ల చీమలకు ఎలర్జీ టెస్టింగ్ : మైల్డ్ పాజిటివ్ -4గా తేలింది. రోగి ఎలర్జీ పరీక్షల వివరాలను పరిగణలో తీసుకొని, అలర్జీ రోగులకు అత్యాధునికమైన అలర్జున్ సిఫిక్ ఇమ్యునో థెరపీ చికిత్స విధానాన్ని అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.