డెంగ్యూకు తొలి మందు!

  • By: Somu    health    Oct 20, 2023 12:19 PM IST
డెంగ్యూకు తొలి మందు!
  • జాన్స‌న్ అండ్ జాన్స‌న్ త‌యారీ
  • క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం



వాషింగ్ట‌న్ : సీజ‌న్ మారుతున్న‌దంటే విజృంభించే వ్యాధుల్లో డెంగ్యూ ఒక‌టి. ఒక్కోసారి ప్రాణాంత‌కంగా మారే ఈ భ‌యాన‌క జ్వ‌రానికి ఇంత వ‌ర‌కూ నిర్దిష్ట‌మైన మందులు, చికిత్సా విధానాలు లేవు. కానీ.. ఈ వైర‌స్‌పై స‌మ‌ర్థ‌వంతంగా పోరాడ‌గ‌లిగే ఔష‌ధాన్ని మొద‌టిసారిగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ అభివృద్ధి చేసింది. అమెరికాలో కొద్ది మందితో హ్యూమ‌న్ చాలెంజ్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌గా.. స‌త్ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్టు జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ శుక్ర‌వారం విడుద‌ల చేసిన డాటా పేర్కొంటున్న‌ది.


ఈ ఔష‌ధంపై త్వ‌ర‌లో షికాగోలో నిర్వ‌హించే అమెరిక‌న్ సొసైటీ ఆఫ్ ట్రాపిక‌ల్ మెడిస‌న్ అండ్ హైజీన్ వార్షిక స‌మావేశంలో కంపెనీ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. డెంగ్యూపై తొలి యాంటివైర‌ల్ ప‌నితీరు ప్ర‌ద‌ర్శ‌న ఇదే మొద‌టిసార‌ని జేఅండ్‌జే పాథోజెన్స్ విభాగాన్ని ప‌ర్య‌వేక్షించే మ‌ర్నిక్స్ వాన్ లూక్ చెప్పారు. హ్యూమ‌న్ చాలెంజ్ ట్ర‌య‌ల్స్‌లో.. ప‌లువురు ఆరోగ్య‌వంతులైన వాలంటీర్ల‌ను పాథోజెన్‌కు ప్ర‌భావిత‌మ‌య్యేట్టు చూసి.. వారికి వ్యాక్సిన్ లేదా చికిత్స అందిస్తారు.


డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌వు. మోకాళ్లు, మోచేతుల్లో తీవ్ర నొప్పి, కండరాల నొప్పి కార‌ణంగా దీనిని బ్రేక్ బోన్ ఫీవ‌ర్‌గా కూడా పిలుస్తుంటారు. ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో దీనిని బారిన‌ప‌డేవారు ఎక్కువ‌గా ఉంటారు. ఏటా ల‌క్ష‌ల మంది దీనిబారిన ప‌డుతుండ‌గా.. వ్యాధి ముదిరి వేల‌ల్లో చ‌నిపోతుంటారు. దోమ‌ల ద్వారా ఈ వైర‌స్ వ్యాపిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్ర‌వేత్త జెరేమి ఫార‌ర్ గ‌తంలో చెప్పారు.


ఈ హ్యూమ‌న్ చాలెంజ్ ట్ర‌య‌ల్స్‌ను అమెరికాలోని జాన్ హోప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌లో నిర్వ‌హించారు. ఇందులో ప‌ది మంది వాలంటీర్ల‌కు డెంగ్యూ వంటిదాన్ని ఇంజెక్ట్‌ చేయ‌డానికి ముందు జే అండ్ జే అభివృద్ధి చేసిన డ్ర‌గ్ డోస్‌ను అధిక మొత్తంలో ఇచ్చారు. అనంత‌రం వారికి 21 రోజుల పాటు ఈ ఔష‌ధాన్ని కొన‌సాగించారు. త‌దుప‌రి నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ప‌దిమందిలో ఆరుగురి ర‌క్తంలో డెంగ్యూ క‌నిపించ‌లేద‌ని, అనంత‌రం 85 రోజుల త‌ర్వాత కూడా వారి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి ఇన్ఫెక్ష‌న్లు గుర్తించ‌లేద‌ని తేలింది.


ఉత్తుత్తి ఔష‌ధం ఇచ్చిన ఐదుగురికి కూడా డెంగ్యూ వైర‌స్‌ను ఎక్కిచ‌గా.. వారిలో మాత్రం వైర‌స్ క‌నిపించింది. ఈ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొన్న‌వారికి నిష్ణాతులైన వైద్యుల నుంచి ప్రామాణిక వైద్యం అందించారు. అదే స‌మ‌యంలో వారికి ఎక్కించినది కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు త‌క్కువ ఉండేలా బ‌ల‌హీన‌ప‌ర్చిన వైర‌స్‌.


ఈ ఔష‌ధం రెండో విడుత ట్ర‌య‌ల్స్ సానుకూల‌ ఫ‌లితాలు.. సాధార‌ణంగా ప్ర‌బ‌లే నాలుగు ర‌కాల డెంగ్యూ వైర‌స్‌ల‌ను అరిక‌ట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించిన‌ట్టు జే అండ్ జే తెలిపింది. త‌దుప‌రి ద‌శ‌లో దీనిని చికిత్సా ప‌ద్ధ‌తిగా ప‌రీక్షిస్తారు. రెండు వైర‌ల్ ప్రొటీన్‌ల‌ను అడ్డుకోవ‌డం, త‌నంత‌ట తానుగా వైర‌స్ వృద్ధి చెంద‌టాన్ని నిరోధించ‌డ‌లో ఈ డ్ర‌గ్ ప‌నిచేస్తుంద‌ని పేర్కొన్న‌ది.