సంతోషం.. దుఃఖం.. అన్నీ నీలోనే..!
విధాత, ప్రత్యేక కథనం: సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటివారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంతోషం గానీ దుఃఖం కానీ ఆకాశం నుంచి అమాంతంగా వూడి పడేవి కావు. మన ఆలోచనలే మన ఆనందానికి కారణమని గ్రహించాల్సిన విషయం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒక్కటి మెదడులోకి ప్రవేశిస్తే చాలు.. ఆనందం ఆవిరైపోతుంది. ఏదీ శాశ్వతం కాదు.. ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి… చీకూ చింతలను దూరంచేసే వ్యాపకాన్ని అలవాటు […]

విధాత, ప్రత్యేక కథనం: సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటివారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంతోషం గానీ దుఃఖం కానీ ఆకాశం నుంచి అమాంతంగా వూడి పడేవి కావు. మన ఆలోచనలే మన ఆనందానికి కారణమని గ్రహించాల్సిన విషయం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒక్కటి మెదడులోకి ప్రవేశిస్తే చాలు.. ఆనందం ఆవిరైపోతుంది.
ఏదీ శాశ్వతం కాదు..
ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి… చీకూ చింతలను దూరంచేసే వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. బుద్ధికి పని కల్పించాలి. ‘ఈ ఘడియలు కూడా శాశ్వతం కాదు, గడచిపోతాయి’- దీన్ని గుర్తుంచుకుంటే సంతోషం సంగతి అలా ఉంచి, ఎంతటి విచారమైనా తట్టుకోవడం తేలికవుతుంది. అంతేకాదు దుఃఖమొచ్చినప్పుడు తట్టుకునే శక్తిని సమకూర్చుకోగలుగుతాము. ‘సుఖదుఃఖాలు శాశ్వతం కాదు’ దీనిని ఒక మంత్రంగా భావించాలి. కష్ట సమయాల్ని పదేపదే ఎదుర్కొన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. చిన్న కష్టానికి చలించిపోయే మనస్తత్వం పోయి దృక్పథంలో సమతుల్యత ఏర్పడుతుంది.
సుఖ దుఃఖాలు అల్పమైనవి..
రెండు భిన్నమైన పరిస్థితులు జంటగా ఉంటాయి. గమనిస్తే- ఆశ నిరాశలు, కలిమిలేములు, లాభనష్టాలు, శీతల ఉష్ణాలు, చీకటి వెలుగులు… ఇలా ఎన్నో మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ఒక్కో సందర్భంలో, ఒక్కొక్కరిలో ఒక్కోస్థాయిలో వస్తుంటాయి, పోతుంటాయి శరీరం ఉన్నంతవరకూ. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టిపోక తప్పదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు అందులో వచ్చిపోయే సుఖదుఃఖాలు ఇంకా ఎంతో అల్పమైనవి.
భ్రమలో ఉంటున్నాం..
మనిషి ఆనందంగా, ప్రశాంతంగా ఉండే శక్తిని అలవరచుకోవాలి. సుఖమైనా, దుఃఖమైనా ప్రత్యేకంగా ఉండదు. అది మనసుమీదే ఆధారపడి ఉంటుంది. దాని స్వభావం చంచలం. యథార్థ స్థితిని గ్రహించినప్పుడే ప్రశాంతంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. కానీ అజ్ఞానం చేత అది బయట దేని కారణంగానో పొందుతున్నామని భ్రమ చెందుతాం.
ఇంద్రియ ఆనందం.. భ్రాంతి
నీటిలో సూర్యుడి ప్రతిబింబం పరిశీలిద్దాం. కంటికి కనిపించినా నీటిలో కనిపించేది సూర్యుడు కాదు ప్రతిబింబమే. ఉందనిపించడం భ్రాంతి. అలాగే ఆనందానుభూతి, సుఖం, సంతోషం… అన్నీ ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతి. ఇది నిజమైన ఆనందం కాదు. భ్రాంతి మాత్రమే. మనిషి అది కావాలి, ఇది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాడు. అవి తాను పొందగలిగితే, సాధించుకోగలిగితే ఆనందం కలుగుతుందని ఆశిస్తాడు. దానికోసం తాపత్రయపడతాడు.
అశాశ్వతాల వైపు పరుగులు
మంచైనా, చెడైనా సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని నిరంతరం పరుగులు పెడతాడు మనిషి. దక్కినట్లే దక్కి చేజారితే ఎంత నిరాశో… దక్కితే ఎంత సంబరమో… ఆ తరవాత? అదే అసలైన ప్రశ్న. ఆ దక్కినది శాశ్వతమా? అశాశ్వతమా అనేది చూస్తూనే ఉన్నాం. తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఆలోచనల్లో మార్పురావటం లేదు. అశాశ్వతమైన వాటివెనక పరుగులు పెడుతూ అసలైన ఆనందాలను దూరం చేసుకుంటున్నాం.
కోరికలను త్యజిస్తేనే..
ఒకదాని తరవాత మరొక ‘కోరిక’తో జీవిస్తున్నాం. ఆ కోరికనే త్యజించగలిగితే అసలైన ఆనందం ఏమిటో తక్షణం అర్థమవుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. కలల ప్రపంచంలో పొందే ఆనందం కంటే అది ఎన్నోరెట్లు అధికమైందని అనుభవం నేర్పుతుంది. కోరికలను అధిగమించగలిగితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శాశ్వతమైన ఆనందాన్నీ సొంతం చేసుకోవచ్చు. అసలైన శాంతి అంతులేని కోరికల వెంట పరుగు ఆపినప్పుడే లభిస్తుందనేది జగమెరిగిన సత్యం.
‘తృప్తి లేకపోతే ఇక అంతే..
తృప్తిగా జీవించే వ్యక్తే సంతోషంగా ఉండగలుగుతాడు. కోటీశ్వరుడైనా తృప్తి లేకపోతే అశాంతితో, ఏదో కోల్పోయిన వాడిలా జీవచ్ఛవంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. తృప్తి కలిగినవారే నిజమైన సంపన్నులు. వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు. వర్తమానానికి విలువ ఇస్తూ, గతంలోని చేదును మరచిపోతూ భవిష్యత్తు గురించి భయంలేకుండా దురాశకు పోకుండా ఉన్నదాంతో తృప్తి చెందే మనస్తత్వం ఏర్పరచుకోవాలి. దేవుడి పట్ల, దేవుడు సృష్టించిన తోటి ప్రాణుల పట్ల ప్రేమతో, కృతజ్ఞతతో జీవించి చూడు ఆనందం ఎక్కడ ఉందో తెలుస్తుంది.