Metabolic Rate | జీవక్రియ.. వేగం పెంచేదెలా?

Metabolic Rate విధాత‌: మానవ శరీరంలో అను నిత్యం అనేక క్రియలు చర్య-ప్రతి చర్యల ద్వారా జరుగుతుంటాయి. సైకిల్ చక్రం మాదిరిగా జరిగే ఈ చర్యల వల్లనే మనుషుల శరీరం సజీవంగా నిలబడుతున్నది. మనుషులు పని పాటల్లో పాల్గొని, తమ శరీరాలను చురుగ్గా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రియలన్నీ సజావుగా సాగాలంటే మనకు తగిన శక్తి అవసరం. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. శక్తిని మనం క్యాలరీల్లో కొలవటం పరిపాటి. ఆహారం ద్వారా […]

Metabolic Rate | జీవక్రియ.. వేగం పెంచేదెలా?

Metabolic Rate

విధాత‌: మానవ శరీరంలో అను నిత్యం అనేక క్రియలు చర్య-ప్రతి చర్యల ద్వారా జరుగుతుంటాయి. సైకిల్ చక్రం మాదిరిగా జరిగే ఈ చర్యల వల్లనే మనుషుల శరీరం సజీవంగా నిలబడుతున్నది. మనుషులు పని పాటల్లో పాల్గొని, తమ శరీరాలను చురుగ్గా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రియలన్నీ సజావుగా సాగాలంటే మనకు తగిన శక్తి అవసరం.

ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. శక్తిని మనం క్యాలరీల్లో కొలవటం పరిపాటి. ఆహారం ద్వారా పొందే క్యాలరీలు.. మనం చేసే పనిద్వారా ఖర్చయి.. శక్తిని ఇస్తాయి. శరీరాలు ఆరోగ్యంగా వుంటాయి. మనం అన్ని వేళలా ఆరోగ్యంగా వుండడానికి మన శరీరంలో జరిగే మెటబాలిజం క్రియలు వేగంగానూ, చురుగ్గానూ వుండాలి.

విశ్రాంతిలోనూ క్యాలరీల ఖర్చు

పనులు, వ్యాయామం చేస్తున్నప్పుడే కాదు.. కూర్చున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా ఒంట్లో క్యాలరీలు ఖర్చవుతాయి. ఇదో నిరంతర ప్రక్రియ. గుండె కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటం వంటి పనులన్నింటికీ శక్తి అవసరం. ఇందుకోసం శరీరం కేలరీలను వినియోగించుకుంటుంది. ఇలా శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకోవటాన్ని జీవక్రియ (మెటబాలిజమ్) అంటాం. మరి దీన్ని పెంచుకునే మార్గమేదైనా ఉందా?

ఒక్కొక్కరిలో ఒక్కోలా..

శరీరం పనిచేయటానికి అవసరమైన కనీస కేలరీల సంఖ్యను మూల జీవక్రియా వేగం (బేసిక్ మెటబాలిక్ రేట్- బీఎంఆర్) అంటారు. ఇది అందరిలో ఒకేలా ఉండదు. వయసు, ఎత్తు, బరువు, ఆడ, మగ కండరం-కొవ్వు నిష్పత్తి, జన్యువులు వంటి వాటిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో కనిపించే చాలా బీఎంఆర్ కాలిక్యులేటర్లు హారిస్ బెనెడిక్ట్ సూత్రం ప్రకారం మూల జీవక్రియా వేగాన్ని పేర్కొంటాయి.

స్మార్ట్ వాచ్ ల వంటివీ ఈ సూత్రం ప్రకారమే రోజుకు ఎన్ని కేలరీలను ఖర్చు చేస్తున్నామో చూపిస్తాయి. ఇలాంటి పరికరాలు పేర్కొనే జీవక్రియా వేగం ఉజ్జాయింపే గానీ అదే కచ్చితమని అనుకోవటానికి లేదు. సాధారణంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి ఒక కేలరీ ఖర్చువుతుందని చెప్పుకోవచ్చు.

చాలామందిలో రోజుకు ఖర్చయ్యే కేలరీల్లో 60% నుంచి 70% వరకు మూల జీవక్రియలకు సంబందించి ఖర్చు కాగా, మిగతా కేలరీలు నడపటం, రోజు వారీ పనులు చేస్తున్నప్పుడు వినియోగమవుతాయి. అదే వ్యాయామం: చేసినట్టయితే ఇంకాస్త ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయి.

కండర వృద్ధితో పెంపు

మూల జీవక్రియా వేగాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా కండరాల మోతాదును పెంచుకోవటం. శరీరం ఎక్కువ శక్తిని వినియోగించుకోవటానికి కండరాలు తోడ్పడతాయి. కండర మోతాదు ఎక్కువగా ఉంటే విశ్రాంతి సమయంలోనూ కేలరీలు అధికంగా ఖర్చవుతాయి. అందువల్ల బరువు తగ్గటానికి ప్రయత్నించేవారు కండరాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం.

బరువు తగ్గే ప్రయత్నంలో కండర మోతాదు తగ్గితే జీవక్రియా వేగమూ నెమ్మదిస్తుంది. దీంతో బరువు తగ్గటం అటుంచి, పెరిగే ప్రమాదముంది. కాబట్టి వ్యాయామం చేయటం మంచిది. ఇది కేలరీలు ఖర్చవ్వటానికే కాదు.. శక్తిని వినియోగించుకునే కండరాలు పుంజుకోవటానికీ తోడ్పడుతుంది. తగినంత ప్రొటీన్ తినటమూ ముఖ్యమే. ఇది కండర వృద్ధికి దోహదం చేస్తుంది.

అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. మన శరీరంలోని అన్ని అంగాలను, క్రియలను సరైన విధంగా సమన్వయం చేస్తూ నడిపించే మెదడుపై పడే ఎటువంటి చింత, చికాకులు, మానసిక వత్తిడిలు అయినా అవి ప్రత్యక్షంగా మెటబాలిజంపై ప్రభావం చూపిస్తాయనేది మర్చిపోకూడదు. దానితో మెటబాలిజం ప్రక్రియ మందగించే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. మెటబాలిజం సామాన్యంగా నడువడానికి మానసిక శాంతి చాలా ముఖ్యం.