ICMR | కోవాక్సిన్‌పై దుమారం.. అటువంటిదేమీ లేదు : ఐసీఎంఆర్
కోవాక్సిన్ భద్రత, ప్రతికూల ప్రభావాలపై బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇచ్చిన నివేదికను భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తప్పుపట్టింది.

దుష్ఫలితాలు నిజమే – బనారస్ విశ్వవిద్యాలయ నివేదిక
న్యూఢిల్లీ: కోవాక్సిన్ భద్రత, ప్రతికూల ప్రభావాలపై బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇచ్చిన నివేదికను భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తప్పుపట్టింది. విశ్వవిద్యాలయ పరిశోధకులు అనుసరించిన పద్ధతి చాలా నాసిగా ఉందని, వారు క్షమాపణ చెప్పాలని వైద్య మండలి పేర్కొంది. స్వదేశీ తయారీ కోవాక్సిన్ ఉపయోగించిన 926 మందిలో మూడవ వంతు మంది తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యారని బనారస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే ఈ పరిశోధనతో తమకు సంబంధం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. తాము శోధించిన వారిలో ఒక శాతం మందికి గుండెపోట్లు వచ్చాయని, గాలియన్ బారీ సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా సంభవించాయని బనారస్ అధ్యయన నివేదిక పేర్కొంది. తాము జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు పరిశోధన చేశామని, తాము పరిశీలించిన వ్యక్తుల్లో 50 శాతం మంది శ్వాసకోశసంబంధ సమస్యలు వచ్చినట్టుగా ఫిర్యాదు చేశారని నివేదిక వివరించింది. మరో 30 శాతం మంది చర్మ సంబంధ సమస్యలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, నాడీసంబంధ బలహీనతలు, కండరాల సమస్యలు తలెత్తినట్టు ఫిర్యాదు చేశారని నివేదిక వివరించింది. మహిళల్లో 4.6 శాతం మంది రుతుక్రమానికి సంబంధించిన సమస్య ఎదుర్కొన్నట్టు చెప్పారు.
అయితే ఈ పరిశోధన చాలా నాసిరకంగా జరిగిందని, వ్యాక్సిన్ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూసే విధానం వారు అనుసరించలేదని ఐసీఎంఆర్ ఆక్షేపించింది. పరిశోధన లోపాలను ఎత్తి చూపుతూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బల్ తమ సంస్థకు ఈ పరిశోధనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తాము ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని కూడా ఆయన చెప్పారు. కోవాక్సిన్ తయారీదారులైన భారత్ బయోటెక్ కూడా బనారస్ నివేదికను తోసిపుచ్చింది. భద్రతా ప్రమాణాలకు సంబంధించి తమకు గొప్పపేరు ఉందని, వివిధ ప్రత్యామ్నాయ అధ్యయనాల్లో అది తేటతెల్లమైందని పేర్కొంది.