Kiwi Benefits | ఆ ఆరు ఆరోగ్య ప్రయోజనాలు దక్కాలంటే మీరు తరచూ కివీ పండు తినాల్సిందే..!

Kiwi Benefits | ఆ ఆరు ఆరోగ్య ప్రయోజనాలు దక్కాలంటే మీరు తరచూ కివీ పండు తినాల్సిందే..!

Kiwi Benefits : తాజా తాజాగా ఉండే పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్‌లు, ఖనిజాలు, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అయితే మన దేహానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలా చూసుకుని డైట్‌ను ప్లాన్‌ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు కూడా ఒకటి. ఈ పండును తరచూ మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోనాలేమిటో చూద్దామా..

1. నాజూకైన చర్మం కోసం

కివీ పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. వంద గ్రాముల కివీ పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్‌లో అధిక శాతం లభిస్తుంది. అంతేగాక కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది. పచ్చి కివీ ముక్కలు తినడం ద్వారా గానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా గానీ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

2. అదుపులో రక్తపోటు

ప్రస్తుతం ఈ భూమ్మీద లక్షలాది మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారికి కివీ ఫ్రూట్‌ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. జీర్ణశక్తి మెరుగు

కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. అంతేగాక, ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్‌లు సునాయాసమైన, ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి దోహదం చేస్తాయి. కివీ పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్‌ ఉంటుంది. దాంతో ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్‌గా మారుతాయి.

4. ఆరోగ్యకరమైన నిద్ర

కివీ పండులో సెరటోనిన్‌ లాంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచి మేలు చేస్తుంది. కివీ పండులోని పదార్థాలు సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5. రోగనిరోధక శక్తి పెంపు

ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సి విటమిన్‌కు కివీ పండు మంచి వనరు. ఈ విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడుతాయి.

6. ఎముకలు పటిష్టం

ఎముక పుష్టి ప్రస్తావన వచ్చినప్పుడు మనకు కివీ పండు అనేది అసలు స్ఫురణకే రాదు. కానీ, వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్‌ ఉంటుంది. ఈ ఫోలేట్‌ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్‌ కే కూడా బాగా ఉపకరిస్తుంది. అందుకే గర్భిణిల డైట్‌లో కివీ పండును చేర్చడం చాలా ముఖ్యం.