మ‌ధుమేహ ప‌రిశోధ‌న కోసం ప్ర‌త్యేక రీసెర్చ్ సెంట‌ర్‌!

జీవ‌న‌శైలి వ్యాధులు పెరుగుతూ, ప్ర‌పంచ‌మంతా ఆరోగ్య సంక్షోభంలో ఉన్న రోజులివి. ఈ క్ర‌మంలో మ‌న ఇండియా ముందంజ‌లో ఉండ‌టం విషాద‌క‌రం

మ‌ధుమేహ ప‌రిశోధ‌న కోసం ప్ర‌త్యేక రీసెర్చ్ సెంట‌ర్‌!

భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ విభాగ మ‌ద్ద‌తుతో ఏఐజీలో ప్రారంభం

“జీవ‌న‌శైలి వ్యాధులు పెరుగుతూ, ప్ర‌పంచ‌మంతా ఆరోగ్య సంక్షోభంలో ఉన్న రోజులివి. ఈ క్ర‌మంలో మ‌న ఇండియా ముందంజ‌లో ఉండ‌టం విషాద‌క‌రం. ప‌ది కోట్ల మంది డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో, మ‌న‌దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న మ‌ధుమేహ మ‌హ‌మ్మారిని త‌క్ష‌ణ‌మే నిర్మూలించాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. అందుకే మ‌న దేశంలో కూడా మ‌ధుమేహం గురించి అధ్య‌య‌నం చేయ‌డానికి ప్ర‌త్యేక ప‌రిశోధ‌నా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించాం. మ‌రో నాలుగు ప్ర‌సిద్ధ సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేసే మా ప‌రిశోధ‌న‌ల కోసం డిబిటి- వెల్క‌మ్ ట్ర‌స్ట్ ఇండియా అల‌య‌న్స్ నుంచి గ్రాంట్ రావ‌డం చాలా సంతోష‌క‌రం. మ‌న వాళ్ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్న మ‌ధుమేహానికి జ‌న్యు, ఆహార‌, జీవ‌న‌శైలి కార‌కాల‌కు అనుగుణంగా నూత‌న చికిత్సా విధానాల ప‌రిశోధ‌న కోసం ముంద‌డుగు వేశాం” అన్నారు ఏఐజీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి. 

మ‌ధుమేహ వ్యాధిపై ప‌రిశోధ‌న‌ల‌ను ముమ్మ‌రం చేయ‌డం కోసం ఏఐజీ హాస్పిట‌ల్స్ లో ఆసియాలోనే మొట్ట‌మొద‌టి ఎండోక్రైన్ పాక్రియాస్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వంలో భాగంగా డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి ఈ దిశ‌గా జ‌ర‌గాల్స‌న రీసెర్చ్ ఇంపార్టెన్స్ గురించి నొక్కి చెప్పారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ రిసెర్చ్ (AC-EPR) సెంటర్లో డయాబిటిస్ కి సంబంధించిన ఆధునిక చికిత్స‌ల‌పై అధ్యయనం చేసి, కొత్త పరిష్కార మార్గాలను కనుగొంటారు. ఈ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ప‌రిశోధ‌న‌ల‌కు కావాల్సిన ఆర్థిక స‌హ‌కారాన్ని భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ విభాగం (డిబిటి) అందించ‌నున్న‌ది. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం https://www.indiaalliance.org/ అనే వెబ్సైట్ లో దొరుకుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికాలో అట్లాంటాలోని ఎమోరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్, నాష్‌ విల్లే లోని వాండర్ బిల్ట్ డయాబెటిస్ సెంటర్, బెంగుళూరుకు చెందిన‌ సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనే నాలుగు సంస్థలతో కలిసి ఈ పరిశోధనా కేంద్రం పని చేస్తుంది.

పాంక్రియాస్ లేదా క్లోమ గ్రంథి లోని ఎండోక్రైన్ వ్య‌వ‌స్థ‌ ప‌ని తీరులో స‌మ‌స్య ఉన్న‌ప్పుడు మ‌ధుమేహ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. పాంక్రియాస్ లోని ఐలెట్ క‌ణాల్లో ఉత్ప‌త్త‌య్యే ఇన్సులిన్ హార్మోన్‌లో స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ర‌క్తంలో చ‌క్కెర‌లు పెరుగుతాయి. అయితే, ఇలా పాంక్రియాస్‌లో గాని, అది ఉత్ప‌త్తి చేసే ఇన్సులిన్ హార్మోన్ లో గాని స‌మ‌స్య‌లు ఎందుకు, ఎలా ఏర్ప‌డుతాయి, దానికి ప‌రిష్కారాల గురించి స‌మ‌గ్ర‌మైన అధ్య‌య‌నం చేయ‌డం కోసమే ఏషియ‌న్ సెంట‌ర్ ఫ‌ర్ ఎండోక్రైన్ పాంక్రియాస్ రీసెర్చ్ సెంట‌ర్ ప్రారంభ‌మైంది.  

ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో-చైర్మన్ ఎండి శ్రీ జివి ప్రసాద్, డా. వి మోహన్ (ఫౌండర్ చైర్మన్, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్), ప్రొఫెసర్ కె ఎం వెంకట్ నారాయణ్ (డైరెక్టర్, ఎమోరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్, అట్లాంటా, అమెరికా), డా. లీసా స్టైమెజ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమోరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్, అట్లాంటా, అమెరికా), ప్రొఫెసర్ ఆల్విన్ సి పవర్స్ (డైరెక్టర్, వాండర్బిల్ట్ డయాబెటిస్ సెంటర్, నాష్విల్లే, TN, అమెరికా), ప్రొఫెసర్ అనురా వి కుర్పాద్ (ప్రొఫెసర్, ఫిజియాలజీ డిపార్ట్మెంట్, సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగుళూరు), డా. శ్రుతి కులకర్ణి (అసోసియేట్ ప్రొఫెసర్, ఇంటర్నల్ మెడిసిన్, సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగుళూరు), డా. బి సేశికేరన్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ పూర్వపు డైరెక్టర్), డా. జివి రావు (డైరెక్టర్, ఎఐజి హాస్పిటల్స్, డా. ఎం శశికళ (ఏషియన్ హెల్త్ కేర్‌ ఫౌండేషన్ డైరెక్టర్) అనే ప్రముఖ వైద్య పరిశోధకుల సమక్షంలో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ ప్రాంగణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ ప్రాజెక్టు ప్రిన్సిప‌ల్ ఇన్వెస్టిగేట‌ర్ గా డాక్ట‌ర్ ఎం. శ‌శిక‌ళ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎండోక్రైనాలజిస్టులు, ప్యాంక్రియాటాలజిస్టులు, మాలిక్యులర్ బయాలజిస్టులు, బయోఇన్ఫర్మేటిషియన్లతో కూడిన ఇంటర్ డిసిప్లినరీ బృందం ఈ ప‌రిశోధ‌న‌ల్లో పాల్గొంటారు. ఎపిడెమాల‌జిస్టులు, మ‌ధుమేహ వ్యాధికి సంబంధించిన ఇత‌ర ప‌రిశోధ‌న‌ల్లో ప‌నిచేస్తున్న నిపుణులు కూడా ఇందులో ఉంటారు. 

ఈ ఏషియన్ సెంటర్ ఫర్ ఎండోక్రైన్ పాంక్రియాస్‌ రీసెర్చ్ (AC-EPR) సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాలన్నింటినీ వినియోగించుకుంటూనే… భారతీయుల్లో ఇన్సులిన్ లోపానికి సంబంధించిన మెకానిజ‌మ్ ఎలా ఉందో, దానికి ఎటువంటి నిర్దుష్ట చికిత్స‌లు అవ‌స‌రం అవుతాయో అధ్య‌య‌నం చేస్తారు. అంతేగాకుండా, బ‌యోబ్యాంక్ లో ఇన్సులిన్ ఉత్ప‌త్తి చేసే క‌ణాల నిల్వ కూడా చేప‌డుతారు. వీటి ద్వారా భ‌విష్య‌త్ ప‌రిశోధ‌న‌లు సులువ‌వుతాయి. 

ప్రస్తుతం, మన దేశంలో డయాబెటిస్ పరిశోధన చాలా పరిమితమై ఉన్నది. జన్యు రూపం లేదా వయస్సు, శరీర బరువు, జాతి-ఆధారిత జీవనశైలి, ఇన్సులిన్ నిరోధకత/లోపం వంటి ఇతర శారీరక కారకాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే ఔషధాలను ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఈ సెంట‌ర్ లో జ‌రిగే ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాలు ప‌ర్స‌న‌లైజ్డ్ చికిత్స‌లు అందించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని చెప్పారు డాక్ట‌ర్ రెడ్డి.