యువకుల్లో పెరుగుతున్న గుండెపోటు!

- ప్రతి 5 కేసుల్లో ఒకరు యువకుడు
- ప్రతి ఏటా రెండు శాతం పెరుగుతున్న
- చిన్న వయస్సులో గుండెపోటు రేటు
- శారీరకశ్రమ లేకపోవడం, మద్యపానం,
- ధూమపానం, అధిక బరువు, ఒత్తిడి,
- బీపీ, షుగర్ గుండెపోటుకు కారణాలు
విధాత: గుండెపోటు.. ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం.. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ పదం పెద్దగా వినిపించేది కాదు. ఏదో కొందరు వృద్ధులు మాత్రమే గుండెపోటు బారినపడే వారు. నేటి ఆధునిక జీవనశైలి, దీర్ఘకాలిక రోగాల కారణంగా యువకులు సైతం గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్నారు. ప్రతి ఐదు గుండెపోటు కేసుల్లో ఒకరు యువకుడు ఉండటం ఆందోళనకరం. చిన్న వయస్సులో గుండెపోటుతో చనిపోతున్న వారి శాతం ప్రతి ఏటా రెండు శాతం పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తున్న అంశం.
ఒకప్పుడు వృద్ధులకు గుండెపోటు సాధారణ సమస్య. ఇప్పుడు 40 ఏండ్లలోపు వయస్సు వారికీ గుండెపోటు రావడం అసాధారణం, ఆందోళనకరం. అది ఎంత తీవ్రంగా మారిందంటే.. ప్రతి ఐదు గుండెపోటు కేసుల్లో ఒకరు 40 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కావడం ఆందోళనకరం. 2000-2016 మధ్య ఈ చిన్న వయస్సులో గుండెపోటు కేసుల రేటు ప్రతి సంవత్సరం రెండు శాతం పెరిగింది.
గుండెపోటు.. అంటే ఒక్కమాటలో గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం. గుండె కండరాలకు రక్త ప్రసరణ ఊహించని విధంగా నిలిచినప్పుడు గుండె కండరాలకు హాని కలిగించే తీవ్రమైన పరిస్థితిని గుండెపోటు అంటారు. కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD), ఇతర సమస్యలతోపాటు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI)కి దారితీయవచ్చు. ఇది ఆకస్మిక మరణానికి కూడా దారి తీస్తుంది.
ధూమపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ఇతర కారణాలతో యువకుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రాబల్యం నెమ్మదిగా పెరుగుతున్నది. ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు అడ్డుకున్నప్పుడు అది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది. ఇందుకు శారీరకశ్రమ లేకపోవడం, రోటీన్ జీవనవిధానం, మద్యపానం, ధూమపానం సేవించడం, అధిక బరువు, తీవ్ర మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్ వంటివి ప్రధాన కారణాలు.

కొన్ని పరీక్షల ద్వారా గుండెపోటు లక్షణాలను ముందే పసిగట్టే నివారణ చర్యలు తీసుకోవచ్చని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. రక్తం పలుచగా కావడానికి యాంటీ ప్లేట్లెట్ మందులు, నొప్పి, ఒత్తిడి నివారణ మందులు, గడ్డలను కరిగించడంలో సహాయపడే మందులు, రక్తపోటుకు మందులు వంటివి వాడితే ఆకస్మిక గుండెపోటు నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.
గుండెపోటు రాకుండా చిన్న టిప్స్
కొన్ని టిప్స్ పాటించడం వల్ల గుండెపోటు రాకుండా యువకులు బయటపడవచ్చని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. చిన్న వయస్సులో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ చిట్కాలు యువతకు ఉపయోగపడతాయని చెప్తున్నారు.
- ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి
- ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి
- ప్యాక్ చేసిన ఆహారం తినడం పూర్తిగా మానేయాలి.
- బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో పెట్టుకోవాలి.
- పొగతాగడం మానేయాలి, ధూమప్రియులకు దూరంగా ఉండాలి.
- శారీరక శ్రమతోపాటు చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
కొంచెం చురుకుదనం, స్వీయ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలితో, గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు.