Cobra Bite First Aid Guide | నాగుపాము కాటువేస్తే వెంటనే ఏం చేయాలి? యాంటీ వెనమ్​ అంటే ఏంటి?

తాచుపాము కాటు వేస్తే వెంటనే ఏం చేయాలో రైతులు, గ్రామీణ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన ఆరోగ్య సూచనలు. లక్షణాలు, ప్రథమ చికిత్స, విరుగుడు ఇంజెక్షన్​ ఇతర వివరాలు తెలుసుకుందాం.

Cobra Bite First Aid Guide | నాగుపాము కాటువేస్తే వెంటనే ఏం చేయాలి? యాంటీ వెనమ్​ అంటే ఏంటి?

Adharva / Health / Agriculture / August 18, 2025

Cobra Bite First Aid Guide | ఇప్పుడు వర్షాకాలం జోరుగా సాగుతోంది. ఎటుచూసినా నీళ్లతో ఊళ్లు తడిసిముద్దయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా పాములు తమ ఆవాసాన్ని కోల్పోయి, గ్రామాల్లోకి వస్తాయి.  నాగుపాము(Indian Cobra) భారతదేశంలో ఎక్కువగా కనిపించే విషసర్పం. పంట పొలాల్లో, గడ్డి దిబ్బల్లో, చెట్ల కింద, పల్లెటూరి ఇళ్ల దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. దాని కాటు ప్రాణాంతకమైనది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి.

తాచుపాములు(India Cobra),  శాస్త్రీయనామం: Naja Naja. పాముకు భారత సంస్కృత శబ్దమైన ‘నాగ’కు లాటిన్​ రూపం.  ప్రధానంగా భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కనిపిస్తాయి. పొలాలు, గడ్డి దిబ్బలు, పంట బార్లు, బావుల దగ్గర, పల్లెటూరి ఇళ్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతాయి. నాగుపాము తలను ఎత్తి పడగ విప్పడం ప్రత్యేక లక్షణం. దాని వెనుక భాగంలో చాలా సార్లు “U” లేదా “కళ్ళజోడు ఆకారం” లాంటి గుర్తు కనిపిస్తుంది. కోబ్రా కాటు ప్రాణాంతకం అయినప్పటికీ, ఇది సహజంగా మనిషిని దాడి చేయదు. తాను భయపడితే లేదా తొక్కితే, కొడితే మాత్రమే కాటు వేస్తుంది. విషసర్పం ఏదైనా కాటువేసినప్పుడు ఆ ప్రదేశంలో రెండు చిన్న రంధ్రాలు లేదా గాట్లు కనబడతాయి. అవి పాము కోరలు శరీరంలోకి దిగినప్పుడు పడే గుర్తులు. అయితే, వాటిని బట్టి కాటేసింది ఏ పామో గుర్తించలేం.  ‘ఇండియన్​ బిగ్​ ఫోర్(Big Four)’​ అనబడే నాలుగు రకాల విషసర్పాలు (తాచుపాము, కట్లపాము, రక్తపింజర, ఇసుకపింజర) కాటేసినప్పుడు ఇవే గాట్లుంటాయి. అందుకే ఈ నాలుగింటికి విరుగుడు ఇంజెక్షన్​ కూడా ఒకటే తయారుచేసారు.

 నాగుపాము కాటు వేసినప్పుడు కనిపించే లక్షణాలు

  • కాటు దగ్గర గట్టి నొప్పి, వాపు
  • శరీరంలో నిస్సత్తువ, బలహీనత
  • కళ్ళు తిరగడం, చూపు మసకబారడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • వాంతులు, తల తిరగడం

ఈ లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అవసరం.

వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్సా చర్యలు

  1. శాంతంగా ఉండాలి – భయపడితే గుండె వేగం పెరిగి విషం త్వరగా వ్యాపిస్తుంది.
  2. పాదం / చేతిని కదల్చకూడదు – కాటు వేసిన భాగాన్ని ఎలాంటి కదలిక లేకుండా ఉంచాలి.
  3. బట్ట లేదా కట్టుతో గట్టిగా కట్టకూడదు – ఇది రక్తప్రసరణ ఆపి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా చేస్తుంది.
  4. తక్షణం ఆసుపత్రికి తరలించాలి – సమీప హాస్పిటల్‌లో యాంటీ వెనమ్ ఇంజెక్షన్ తప్పనిసరి.
  5. కాటు దగ్గర గాటుపెట్టడం, రక్తం పీల్చడం చేయకూడదు – ఇవి పాత పద్ధతులు, ప్రాణాలకు ప్రమాదం.

చేయకూడని తప్పులు

  • నిమ్మరసం, కాఫీ, మద్యం వంటివి తాగించడం
  • ఆలస్యం చేయడం
  • మూఢనమ్మకాలతో ఆసుపత్రికి కాక, వేరే చోటికి తరలించడం

 ఆసుపత్రిలో చికిత్స

కోబ్రా కాటు నుంచి రక్షణ పొందడానికి యాంటీ వెనమ్ సీరం (AVS) మాత్రమే సమర్థవంతమైన చికిత్స. కాబట్టి ఆసుపత్రికి చేరుకోవడం ప్రాణరక్షణలో ప్రధానమైనది.

యాంటీ వెనమ్ సీరమ్ అంటే ఏమిటి?

  • ఇది పాముల కాటు విషాన్ని నిర్వీర్యం చేసే ప్రత్యేకమైన ఇంజెక్షన్.
  • పాముల నుంచి తీసిన విషాన్ని గుర్రాలకు చిన్న మోతాదులో ఇస్తారు. వాటి రక్తంలో ఏర్పడే ప్రతిరక్షకాలు (Antibodies) ను శుద్ధి చేసి ఈ సీరమ్ తయారు చేస్తారు.
  • భారతదేశంలో వాడే యాంటీ వెనమ్ నాగుపాము, కట్లపాము, రక్తపింజర, ఇసుకపింజర కాట్లకు ఉపయోగపడుతుంది.
  • అంటే పాము విషానికి విరుగుడు పాము విషమే అన్నమాట.

 రైతులు, గ్రామీణ ప్రజలకు సూచనలు

  • పొలాల్లో పని చేసే సమయంలో వీలైతే బూట్లు, చేతి గ్లౌజులు ధరించాలి. మన దగ్గర ఇవి ఎలాగూ వాడరు.
  • గడ్డి దిబ్బలు, రాళ్ళు కదిలించే ముందు జాగ్రత్తగా ఉండాలి.
  • ఇంటి దగ్గర పాము కనపడితే వెంటనే పాములు పట్టే వారికి గానీ, స్నేక్​ సొసైటీకి గానీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • పాము కరిచితే ప్రథమ చికిత్స తర్వాత వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలి.

పాము కాటు కన్నా భయమే ఎక్కువ ప్రమాదకరం. శాంతంగా ఉండి, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాలు తప్పక రక్షించబడతాయి.” నాగుపాము కాటు ప్రాణాంతకం అయినా రైతులు, గ్రామీణ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ, కాటు పడిన వెంటనే ఆసుపత్రిని ఆశ్రయిస్తే ప్రాణాలు తప్పక కాపాడబడతాయి.

ఇవి కూడా చదవండి..

Snakes| మీ ఇంటి దగ్గర పాములు లేవా? అయితే తస్మాత్ జాగ్రత్త!
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?