ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో.. 21 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో.. 21 మంది జ‌ర్న‌లిస్టులు మృతి
  • అక్టోబర్ 7 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు
  • కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ వెల్ల‌డి



విధాత‌: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్ప‌టివ‌ర‌కు 21 మంది జ‌ర్న‌లిస్టులు మ‌ర‌ణించారు. వారిలో 17 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయెలీలు, ఒక‌ లెబనీస్ జ‌ర్న‌లిస్టు ఉన్నారు. ఈ విష‌యాన్ని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) వెల్ల‌డింది.


కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ప్రకారం.. అక్టోబర్ ఏదో తేదీన‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వ‌ర‌కు ఇజ్రాయెల్, పాలస్తీనాలో 4,000 మందికిపైగా మరణించారు. వారిలో కనీసం 21 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఎనిమిది మంది జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. ముగ్గురు తప్పిపోయినట్టు లేదా నిర్బంధించబడినట్టు క‌మిటీ నివేదించింది.


అనేక దేశాల్లోనూ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌ర్న‌లిస్టులు త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వార్తలు సేక‌రిస్తున్నారు. యుద్ధ స‌మ‌యాల్లో వార్త‌ల‌ను సేక‌రించే క్ర‌మంలో త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. 2001 నుంచి జరిగిన జర్నలిస్టుల మ‌ర‌ణాల‌ కంటే గత రెండు వారాల్లో గాజాలో ఎక్కువ మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని క‌మిటీ తెలిపింది.


గాజాలో రిపోర్టర్లు విద్యుత్తు, ఇంటర్నెట్ అంతరాయాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది తమ కార్యాలయాలు, ఇండ్లు, ఇత‌ర ఆస్తుల‌ను కోల్పోతున్నారు. అంతేకాదు కుటుంబ స‌భ్యుల ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్నారు. ఇప్పటివరకు హ‌త్య‌కు గురైన‌, గాయపడిన, నిర్బంధానికి గురైన‌, తప్పిపోయిన జర్నలిస్టుల వివరణలను సీపీజే ప్రచురించింది.


గురువారం నాటికి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 3,785 మంది మరణించారని, 12,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ గ్రూప్ దాడి చేసి 1,400 మందికి పైగా మరణించిన తర్వాత ఈ వైమానిక దాడులు జరిగాయి. గాజాలో కనీసం 203 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.