Pregnant Woman | ఇదేమి వింత.. ప్రెగ్నెన్సీ అని తెలిసిన 17 గంటలకే పండంటి బిడ్డకు జన్మ
Pregnant Woman | నిజంగా ఇది వింతనే.. ఆశ్చర్యపోక తప్పదు.. ఓ 20 ఏండ్ల మహిళకు తాను ప్రెగ్నెన్సీ( Pregnancy ) అని తెలిసిన 17 గంటల 21 నిమిషాలకు పండంటి బిడ్డకు( Infant ) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సదరు మహిళ కూడా నమ్మలేక.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రసవం అయ్యే నాటికి ఆమె 8 నెలల గర్భిణి( Pregnant ) అని తెలుసుకుని షాకైంది. ఏది ఏమైనప్పటికీ.. ఆ మహిళకు ఇది ఒక వింతే అని చెప్పొచ్చు.

Pregnant Woman | ఆస్ట్రేలియా( Australia )కు చెందిన చార్లొట్టే సమ్మర్స్(Charlotte Summers )కు 20 ఏండ్లు. ఆమె రెండున్నరేండ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 6వ తేదీ వరకు ఆమెకు క్రమం తప్పకుండా నెలసరి అవుతుంది. దీంతో ఆమె తాను గర్భం ధరించలేదనే భ్రమలోనే ఉండిపోయింది. కనీసం బరువు కూడా పెరగలేదు. కడుపులో బిడ్డ తిరుగుతున్నట్లు కూడా ఆమెకు అనిపించలేదు.
అయితే ఆమె గ్లూటెన్ సెన్సిటివీటి( gluten sensitivity )తో బాధపడుతూ జూన్ 6న డాక్టర్‌ను సంప్రదించింది. అప్పుడు ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్టు( Pregnancy Test ) చేయగా, పాజిటివ్‌గా నిర్ధారించబడింది. ప్రస్తుతం మీరు గర్భం దాల్చారని, అది ప్రారంభ దశలో ఉందని సమ్మర్స్‌కు డాక్టర్ తెలిపాడు. క్షణాల్లోనే ఆమె తన భర్తకు విషయాన్ని తెలియజెప్పింది.
ఈ క్రమంలో భర్త సహకారంతో సమ్మర్స్ అల్ట్రాసౌండ్ పరీక్షలు( Ultra Sound Test ) చేయించుకోగా, మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. గర్భం ప్రారంభ దశలో లేదు.. ప్రస్తుతం 8 నెలల గర్భిణి మీరు అని రేడియాలజిస్ట్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం సమ్మర్స్ వంతైంది. 38 వారాల 4 రోజుల గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. అయితే పిండం చుట్టూ ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పి, ఆమెను డెలివరీకి సిద్ధం చేశారు. ఏడు నిమిషాల్లో ఆమె పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ 17 గంటల్లో అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని చార్లెట్ సమ్మర్స్ పేర్కొన్నారు.