పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ప‌లికిన కాంగ్రెస్‌.. మండిప‌డిన బీజేపీ

పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ప‌లికిన కాంగ్రెస్‌.. మండిప‌డిన బీజేపీ
  • మైనారిటీ రాజ‌కీయాల వ‌ల్లే 2004-14 మ‌ధ్య ఉగ్ర‌దాడుల‌ని విమ‌ర్శ‌


ఇజ్రాయెల్- పాలస్తీనాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌పై భార‌త ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలైన బీజేపీ, కాంగ్రెస్ చెరో వైపున నిల‌బ‌డ్డాయి. ఇజ్రాయెల్‌పై ఉగ్ర‌వాద దాడిని ఖండిస్తున్నామ‌ని ప్ర‌ధాని, భాజ‌పా అగ్ర‌నేత న‌రేంద్ర‌మోదీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ అత్యున్న‌త విభాగం అయిన సెంట్ర‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) సోమ‌వారం స‌మావేశం అనంత‌రం పాల‌స్తీనా హ‌క్కులకు మ‌ద్ద‌తు తెలిపే సంప్ర‌దాయానికి అనుగుణంగా ఇప్పుడూ వారి వైపే ఉంటామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుప‌డింది. మైనారిటీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్లే కాంగ్రెస్ పాల‌నలో పాక్ భార‌త్‌పై ఉగ్ర‌వాద దాడుల‌కు దిగింద‌ని ఆరోపించింది.


2004-14 కాలంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ప‌రిస్థితినే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదుర్కొంటోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఆ కాలంలో జ‌రిగిన ఉద్ర‌దాడుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆ పార్టీ నాయ‌కులు ఎక్స్‌లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మ‌రోవైపు ఇజ్రాయెల్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌లో ఎటువంటి విప‌రిణామాలూ తలెత్త‌కూడ‌ద‌ని కేంద్రం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో దిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబ‌సీ, చాబాద్ హౌస్ ఎదుట‌ పోలీసు బందోబ‌స్తును దిల్లీ పోలీసులు ప‌టిష్ఠం చేశారు. ఇజ్రాయెల్‌పై హ‌మాస్ శనివారం దాడులు ప్రారంభించ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.