బంగాళాఖాతంలో భూకంపం
బంగాళాఖాతంలో భూకంపం చోటు చేసుకున్నది. సునామీ ప్రమాదం లేదన్న అధికారులు.

♦ రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదు
బంగాళాఖాతం ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) సోమవారం వెల్లడించింది. భూకంప కేంద్రం 12.49 అక్షాంశం, 91.52 రేఖాంశం వద్ద 10 కిలోమీటర్ల లోతున గుర్తించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది.
భూకంపం 4.3 తీవ్రతతో 10 కిలోమీటర్లలోన ఏర్పడినందుగా పెద్దగా ప్రమాదం ఏమీలేదని పేర్కొన్నది. సునామీ లాంటి ప్రమాదాలు ఏమీ లేవని తెలిపింది. బంగాళాఖాతంలో భూకంపాలు అసాధారణం కాదని పేర్కొన్నది. భౌగోళిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఎన్‌సీఎస్ భూకంప సంఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నది.
161కి పెరిగిన జపాన్ భూకంప మృతులు
కొద్ది రోజుల క్రితమే జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇందులో మరణించిన వారి సంఖ్య 161కి చేరింది. మరో వందమంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. భూకంపాలు, వాటి కారణంగా సుమారు వెయ్యి కొంచచరియలు విరిగిన ఘటనలతో ఇషికవా ప్రాంతంలో ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరోవైపు దట్టంగా కురుస్తున్న మంచు వల్ల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. 404 పునరావాస కేంద్రాల్లో 28,800కుపైగా ప్రజలు తలదాచుకుంటున్నారు. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నది. దీనికితోడు ఎడతెగని వానతో మరికొన్ని చోట్ల తాజాగా కొందచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి.