విమానం కూలి నలుగురి మృతి.. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు

విధాత: ఆస్ట్రేలియా (Australia) లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో చిన్న సైజు విమానం ఒకటి కూలిపోయింది. దీంలో పైలట్ సహా ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. సిర్రస్ ఎస్ఆర్ 22 పేరుతో ఉన్న విమానం.. దేశ రాజధాని కాన్‌బెర్రా విమానశ్రయం నుంచి క్వీన్‌బేయాన్ నగరానికి పయనమైంది. మార్గ మధ్యంలో ఉండగా జార్జ్ సరస్సు సమీపంలో హఠాత్తుగా కూలిపోయి మంటల్లో చిక్కుకుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే విమానంలోని అందరూ మృతి చెందారు. అయితే శకలాల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. విమానం ఎంత మంది ఎక్కారనే దానిపై స్పష్టత లేకపోవడంతో .. దర్యాప్తు పూర్తయిన తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశముంది. సుశిక్షితుడైన పైలటే ఈ విమానాన్ని నడిపారని, మృతుల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఘటనకు కారణాలను అన్వేషిస్తామని తెలిపింది.