సింగపూర్‌లో విద్యార్థినిపై రేప్ కేసులో.. భార‌తీయ యువ‌కుడికి 16 ఏండ్ల‌ జైలుశిక్ష

సింగపూర్‌లో విద్యార్థినిపై రేప్ కేసులో.. భార‌తీయ యువ‌కుడికి 16 ఏండ్ల‌ జైలుశిక్ష
  • 2019 మే 4న లైంగిక‌దాడి ఘ‌ట‌న‌
  • నాలుగేండ్ల విచార‌ణ త‌ర్వాత తీర్పు



విధాత‌: సింగ‌పూర్‌లో క‌ళాశాల విద్యార్థినిపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో భార‌తీయ యువ‌కుడికి అక్క‌డి కోర్టు 16 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 12 లాఠీ దెబ్బలు కూడా కొట్టాల‌ని ఆదేశించింది. డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (డీపీపీ) కయల్ పిళ్లై వివ‌రాల ప్ర‌కారం.. 2019 మే 4న యూనివర్సిటీ విద్యార్థిని బస్‌స్టాప్‌కు అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా, క్లీనర్‌గా పనిచేస్తున్న 26 ఏండ్ల చిన్నయ్య ఆమెకు త‌ప్పు దారి చూపించాడు. కొద్దిదూరం వెళ్లిన త‌ర్వాత ఆమెను కొట్టి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్ప‌డ్డాడు.


లైంగిక‌దాడికి య‌త్నిస్తున్న క్ర‌మంలో అత‌డిని ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది. కానీ, ఆమెను తీవ్రంగా కొట్టి గాయ‌ప‌ర్చి రేప్ చేశాడు. అనంత‌రం అత‌డు ఆమె వాటర్ బాటిల్ తీసుకొని నీటిని తాగాడు. మిగిలిన నీటిని ఆమె శరీరం దిగువ భాగంలో పోసి రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె బ్యాగ్‌లోని డ‌బ్బులు, ఇత‌ర వ‌స్తువుల‌ను తీసుకొని అక్క‌డి నుంచి ఉడాయించాడు.


ఆమె కండ్ల‌ద్దాలు క‌నిపించ‌క‌పోయినా, దూరంగా ఫోన్‌ను గుర్తించి స్నేహితుడికి ఫోన్ చేసింది. స్నేహితుడి స‌హ‌కారంతో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు వైద్య‌ పరీక్ష కోసం విద్యార్థిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఆమె మెడ భాగంలో గొంతునులిమిన‌ గుర్తులతో సహా పలు గీతలు, గాయాలు ఉన్న‌ట్టు గుర్తించారు.


నిందితుడు చిన్నయ్యను 2019న మే 5న పోలీసులు అరెస్టు చేశారు. చిన్నయ్య మానసిక పరిస్థితిపై అనేక దఫాలు మానసిక వైద్య పరీక్షలు అవసరమని కోర్టు పేర్కొన్నందున‌ కేసు విచారణకు నాలుగేండ్ల స‌మ‌యం ప‌ట్టింది. నేరారోప‌ణలు రుజువు కావ‌డంతో చిన్న‌య్య‌కు 16 ఏండ్ల జైలు శిక్ష‌తోపాటు 18 లాఠీ దెబ్బలు కొట్టాల‌ని న్యాయ‌స్థానం తాజాగా తీర్పు చెప్పింది.