అంత‌రించిపోయిన జావా స్టింగారీ జ‌ల‌చ‌రం .. మాన‌వ చ‌ర్య‌ల వ‌ల్ల జ‌రిగిన‌ట్లు తొలిసారి అధికారిక ప్ర‌క‌ట‌న‌

మాన‌వ త‌ప్పిదాల‌తో చ‌రిత్ర‌లో తొలిసారి ఒక జ‌ల‌చరం అంత‌రించిపోయిన‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఫ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ఆఫ్ నేచ‌ర్ (ఐయూసీఎన్‌) ప్ర‌క‌టించింది

అంత‌రించిపోయిన జావా స్టింగారీ జ‌ల‌చ‌రం .. మాన‌వ చ‌ర్య‌ల వ‌ల్ల జ‌రిగిన‌ట్లు తొలిసారి అధికారిక ప్ర‌క‌ట‌న‌

మాన‌వ త‌ప్పిదాల‌తో చ‌రిత్ర‌లో తొలిసారి ఒక జ‌ల‌చరం (Extinction of Aquatic Animal) అంత‌రించిపోయిన‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఫ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ఆఫ్ నేచ‌ర్ (ఐయూసీఎన్‌) ప్ర‌క‌టించింది. ఇండోనేసియా తీరంలో దొరికే ఈ చేప పేరు జావా స్టింగారీ (Java Stingaree) కాగా దీని శాస్త్రీయ నామం యురోలోఫ‌స్ జావానీషియ‌స్‌. 1862లో జ‌ర్మ‌న్‌కు చెందిన ఎడ్వ‌ర్డ్ వోన్ మార్టెన్స్జ‌.. త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా తూర్పు దేశాల్లో ప‌ర్య‌టించాడు. అందులో భాగంగా ఇండోనేసియాలోని జ‌కార్తా చేప‌ల మార్కెట్‌లో తిరుగుతూ అక్క‌డ అమ్ముతున్న జావా స్టింగారీని కొన్నాడు. అతడే ఆ చేప‌ని చూసిన చివ‌రి శాస్త్రవేత్త అని అప్ప‌టికి మార్టిన్‌కు తెలియ‌దు.


కాలం 161 ఏళ్లు గిర్రున తిరిగిన త‌ర్వాత ఇప్పుడు ఆ చేప అంతిరించిపోయింద‌ని ప్ర‌క‌ట‌న రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అయితే ఒక జీవి అంత‌రించిపోయిందని ప్ర‌క‌టించ‌డానికి శాస్త్రవేత్త‌లు చాలా నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. ఎంత‌లా అంటే జావా స్టింగారీ అంత‌రించిపోయింద‌ని చెప్ప‌డానికి శాస్త్రవేత్త‌లు 150 ఏళ్ల పాటు వివిధ ప‌రిశోధ‌న‌లు చేశారు. ఇందులో వివిధ దేశాల శాస్త్రవేత్త‌లు, సంస్థ‌లు పాల్గొన్నాయి. ఆ వివ‌రాల‌న్నింటినీ క్రోడీక‌రించి ఐయూసీఎన్ (IUCN) ఈ ప్ర‌క‌టన చేసింది. 1862లో ఎడ్వ‌ర్డ్ ఆ చేప‌ను కొనేట‌ప్ప‌టికే అవి అంత‌రించి పోయే ద‌శ‌లో ఉన్నాయని చార్లెస్ డార్విన్ యూనివ‌ర్సిటీలో ఐయూసీఎన్ ప‌రిశోధ‌కురాలు జూలియా వెల్ల‌డించారు. ఒక వేళ ఎడ్వ‌ర్డ్ ఆ రోజు చేప‌ను కొన‌క‌పోతే మ‌న‌కు ఈ రోజు అటువంటి చేప అంత‌రించ‌డం గురించే కాకుండా పుట్టుక గురించి కూడా తెలుసుకునే అవ‌కాశం లేకపోయేద‌ని ఆమె అన్నారు. ఎడ్వ‌ర్డ్ త‌ర్వాత ఎందరో ప‌రిశోధ‌కులు స్థానిక మ‌త్స్య‌కారులు ఇండోనేసియా స‌ముద్ర తీరాన్ని చేప‌ల మార్కెట్ల‌ను జ‌ల్లెడ ప‌ట్టినప్ప‌టికీ ఎవ‌రికీ జావా స్టింగారీ క‌నిపించ‌లేద‌ని పేర్కొన్నారు.


అంత‌రించిపోవ‌డం అనేది ఒక శాశ్వ‌త‌మైన మార్పు. జావా స్టింగారీ అనేది అస‌లు స‌మ‌స్య‌లో ఒక చిన్న కొన మాత్ర‌మే. మ‌న దృష్టికి రాకుండా ఎన్ని జ‌ల‌చ‌రాలు అంత‌రించిపోయాయో ఎవ‌రికి తెలుసు అని జులియా ప్ర‌శ్నించారు. నిజానికి అనంతంగా ఉండే స‌ముద్రంలో జ‌ల‌చ‌రాల‌కు మాన‌వ చ‌ర్య‌ల వ‌ల్ల ఏ ఇబ్బందీ ఉండ‌ద‌ని తొలిత‌రం శాస్త్రవేత్త‌లు భావించేవారు. అందుకే 20వ శ‌తాబ్దం చివ‌రి వ‌ర‌కు జ‌ల‌చ‌రాల సంర‌క్ష‌ణ‌పై ఎటువంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. దీని కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో చేప‌ల జ‌నాభా త‌గ్గిపోయింది. ఇదే జావా స్టింగారీ వంటి చేప‌ల‌కు శాపంగా ప‌రిణ‌మించింది. 2020లో స్మూత్ ఫిష్ అనే చేప అంత‌రించిపోయిన‌ట్లు ఐయూసీఎన్ ప్ర‌క‌టించింది. అయితే దానిని ధ్రువ‌ప‌ర‌చ‌డానికి స‌రైన రుజువులు లేక‌పోవ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకుంది.

జావా స్టింగారీ అంటే…

స్టింగ్రే కుటుంబానికి చెందిన వాటిలో ఒక ర‌క‌మైన చేప జావా స్టింగారీ. ఇండో ప‌సిఫిక్ స‌ముద్రంలో జీవించే దీనికి విష‌పూరిత‌మైన కొండె ఒకటి తోక ప్రాంతంలో ఉంటుంది. స‌ముద్రం అడుగు భాగంలో జీవించే ఇవి ఆడ‌వి. ఎడ్వ‌ర్డ్‌కు దొరికిన ఆ చేప ఒక విస్త‌రి ఆకారంలో ఉంటుంది. ఆ ఫొటో తీసిన‌ప్పుడు అది ఏ వ‌య‌సులో ఉందో తెలియ‌దు. కాబ‌ట్టి దాని ప‌రిమాణం గురించి శాస్త్రవేత్త‌ల‌కు స్ప‌ష్ట‌త లేదు. జావా తీరంలో అతిగా జ‌రిగిన వేట వ‌ల్లే స్టింగారీలు అంత‌రించిపోయాయ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. 1870ల నాటికే అక్క‌డ వాటి సంత‌తి త‌గ్గిపోయింద‌ని వెల్ల‌డించారు. ఇవి గుడ్లు పెట్ట‌డం, అవి పొద‌గ‌డం వంటి ప్ర‌క్రియ జ‌ర‌గ‌డానికి స‌మ‌యం ఎక్క‌వ ప‌డుతుంది.


ఇవి క‌నిపించ‌కుండా పోవడానికి ఇదీ ఒక కార‌ణం. గ‌త 20 ఏళ్లుగా పెరిగిన సాంకేతిక‌త సాయంతో ఇండోనేసియా తీరాల్లో శాస్త్రవేత్త‌లు ఈ చేప కోసం ఒక అన్వేష‌ణే సాగించారు. అయినా ఉప‌యోగం లేకుండా పోయింది. ఇదే కాకుండా స్టింగ‌రీ కుటుంబంలోనే మ‌రో చేప‌యిన కాయ్ స్టింగారీ కూడా అంత‌రించిపోయి ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 1874 త‌ర్వాత దీని గురించి కూడా ఎటువంటి రికార్డులూ అందుబాటులో లేవు. అయితే ఇది చివ‌రి సారి స‌ముద్రంలో 774 అడుగుల లోతున క‌నిపించింది కాబ‌ట్టి.. ఎక్క‌డో ఒక చోట మ‌త్స్య‌కారులకు చిక్క‌కుండా జీవిస్తూ ఉండొచ్చ‌ని ఆశాభావంతో ఉన్నారు.