హత్య కేసు వింటూ సెల్‌ఫోన్‌లో వ్యంగ్యంగా మెసేజ్‌లు పంపిన జడ్జి.. వేటు పడే అవకాశం

విధాత: కేసు వాదనలు వినేటప్పుడు, తీర్పు ఇచ్చేటప్పుడు జడ్జిలు ఎంతో శ్రద్ధగా ఇరు వైపులా వాదనలు విని సరైన తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అమెరికా (America) లోని ఓ జడ్జి నిర్లక్ష్యం (Judge Inappropriate Messages) తో చేసిన పనికి ఆమె ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలోని లింకన్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జిగా ట్రేసీ సోడర్‌స్ట్రోం పని చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది జులైలో తన ముందుకు ఓ మర్డర్ కేసు వచ్చింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా ఆమె ఫోన్‌లో ఆ కేసు గురించి తన వ్యాఖ్యానాలను మెసేజ్ రూపంలో ఇతరులతో పంచుకున్నారు. అంతే కాకుండా వివిధ సైట్లను స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇదంతా కోర్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై అప్పట్లోనే వివిధ పత్రికల్లో ఫొటోలు వచ్చాయి.
ఆ కథనాల ప్రకారం.. తన స్నేహితురాలి రెండేళ్ల కుమారుణ్ని ఓ యువకుడు చంపేశాడన్న కేసు అది. ఈ కేసులో ఆ కుమారుడి తల్లికి అప్పటికే 25 ఏళ్లు జైలు శిక్ష పడగా.. హత్య కేసులో యువకుణ్ని శిక్షించాలా లేదా అని ట్రేసీ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ వాదనలు జరుగుతూ ఉండగా.. ‘ తల్లి తన కుమారుణ్ని చంపిందని నమ్మడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అందుకే వారు తర్వాతి వ్యక్తిపై పడతారు’ అని ఓ మెసేజ్ పంపింది.
ఇదే కాకుండా తన ప్రశ్నలకు ప్రాసిక్యూటర్ కోటు తడిసిపోతోందని, నిందితుడి తరఫు లాయర్ అద్భుతంగా వాదిస్తున్నారని, అతడి కోసం చప్పట్లు కొట్టాలని ఉందని.. ఇలా సుమారు 500 మంది మెసేజ్‌లు ఆ జడ్జి పంపించారు. అంతే కాకుండా కేసు విచారించిన పోలీసు అధికారి బాగున్నారని, అతడిని రోజంతా చూడాలని ఉందని.. అసభ్యకరమైన మెసేజ్‌లూ పంపించారు.
ఈ ఆరోపణలపై వెంటనే ఓక్లహామా సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దర్యాప్తు అనంతరం…జడ్జి ట్రేసీని విధుల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టుకు నివేదించింది. దీనిపై ఓక్లహామా జడ్జి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కమిటీ ముందు విచారణకు హాజరైన సమయంలో ట్రేసీ తన మెసేజ్‌లపై బాధపడకపోగా.. అవి సరదా కోసం చేశా.. వదిలేయండి అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆమె పదవీకాలం 2027తో ముగుస్తున్నట్లు తెలుస్తోంది.