సుదీర్ఘ పాలస్తీనా రక్తసిక్త దారిలో కీలక మలుపులు సంక్షిప్త సింహావలోకనం. శీర్షికతో నేను సోషల్ మీడియాలో తొమ్మిది భాగాలు రాసిన విషయం తెల్సిందే! అవి ప్రతిరోజూ కాకుండా నా సౌలభ్యం ప్రకారం 12-10-2023 తేదీ నుండి 5-11-2023 తేదీ మధ్య ముగించా

ప్రియమైన మిత్రులారా!

సుదీర్ఘ పాలస్తీనా రక్తసిక్త దారిలో కీలక మలుపులు సంక్షిప్త సింహావలోకనం. శీర్షికతో నేను సోషల్ మీడియాలో తొమ్మిది భాగాలు రాసిన విషయం తెల్సిందే! అవి ప్రతిరోజూ కాకుండా నా సౌలభ్యం ప్రకారం 12-10-2023 తేదీ నుండి 5-11-2023 తేదీ మధ్య ముగించా. ఆ సీరియల్ భాగాలతో పాటు ఈ కాలంలో ఇదే అంశంపై రాసిన మరికొన్ని ప్రాధాన్యత గల రైటప్స్ ని అనుబంధాలుగా చేర్చి ఓ పుస్తక సంకలనంగా పిడిఎఫ్ చేసి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ హామీ మిత్రుల దృష్టిలో వుంది. హామీ అమలులో ఆలస్యం జరుగుతున్నది.

ఏలూరులోని 'గోదావరి విజ్ఞాన కేంద్రం' మిత్రులు నిడదవోలు వెంకటేశ్వర రావు గారి తొలి చొరవతో పుస్తకం మొగ్గ తొడిగింది. మరోమిత్రులు తాజారావు గారి (సంగమం ప్రతినిధి, రిటైర్డ్ BSNL ఉద్యోగి) సహకారంతో కాపీ ప్రూఫ్ రీడింగ్ ప్రక్రియ పూర్తైనది. సంస్థాగత సహచరుడు పొలారి సహకారంతో పుస్తకం తుది రూపానికి వస్తోంది. అది దాదాపు ముగింపు దశకి వచ్చింది. కవర్ పేజీ డిజైన్ పనితో పాటు తుది కూర్పుని మరోసారి చూసుకునే దశలోకి వచ్చింది.

పాలస్తీనియన్ జాతీయ విమోచన పోరాటం నేడు ఒక ప్రత్యేక మలుపు తీసుకునే దశకి చేరింది. ఈ వర్తమాన మలుపుకు గాజా అద్దం పడుతోంది. అదోవైపు క్రూరాతిక్రూర అమానుష అణచివేతకూ మరోవైపు తీవ్రాతితీవ్ర ప్రజా ప్రతిఘటనా స్థితికీ అద్దం పడుతోంది. నేడు ఈ రెండు అంశాలు కూడా (అణచివేత, ప్రతిఘటన) గాజాలో పతాక స్థాయికి చేరాయి. తొలి అంశం కంటే, రెండవ అంశం వర్తమాన ఆధిపత్య సామ్రాజ్యవాద ప్రపంచ వ్యవస్థలో ప్రాధాన్యత గలది. అది ప్రతిబింబించే పేరు (శీర్షిక) పుస్తకానికి పెట్టాలని భావించా. ఈ దృష్టితో మండే మంట గాజా పేరు ఎంపిక చేశా. దాని క్రింద ఉప శీర్షిక (సబ్ హెడ్డింగ్) 'జాతి ప్రక్షాళన వ్యతిరేక పాలస్తీనా జాతీయ విమోచనోద్యమ దారిలో...' అని పెట్టా. ఐతే పునరాలోచన కూడా ఉంది. ప్రధాన శీర్షికను మండిస్తూ మండే గాజా పెట్టే ఆలోచన కూడా చేస్తున్నా. దానికి కూడా కారణం ఉంది.

మండే మంట గాజా శీర్షిక కేవలం ప్రతిఘటించే గాజా ప్రజలకి ప్రతిరూపం గా ఉంది. మండిస్తూ మండే మంట గాజా శీర్షిక పీడిత ప్రపంచాన్ని గాజా ప్రజలు ఒకవైపు తమ ఆత్మబలిదానాలతో మేల్కొలిపి వీధుల్లోకి జనాన్ని తెస్తూ తమకు సంఘీభావతని సాధిస్తూ; మరోవైపు ప్రతిఘటనని కొనసాగిస్తోన్న స్థితికి అద్దం పడుతుంది.

ఈ రెండు శీర్షికలలో సూచనలుంటే మిత్రుల నుండి కోరుతున్నా. తుది క్షణంలో కూడా పుస్తకం టైటిల్ మార్చుకోవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ గారిని 'ముందుమాట' కోరాను. వారు రాసిచ్చారు. ఈ పుస్తకానికి నిండుదనం తేవడానికి ఉపకరించిన ఒక అంశమది.

అనేకమంది మిత్రులు, సన్నిహితులు, కామ్రేడ్స్ ఈ పుస్తకం పిడిఎఫ్ గా చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం కంటే పుస్తకంగా ప్రింటింగ్ చేస్తే మంచిదని సూచనలు చేశారు. వీరిలో mges ద్వారా తెలిపిన వారు ఎక్కువమంది వున్నారు. మరికొందరు కాల్ చేసి మాట్లాడారు. ఇంకొందరు ముఖాముఖిగా కల్సిన సందర్భాల్లో నా దృష్టికి తెచ్చారు. విజయవాడలో ఈనెల 28 నుండి సాగే బుక్ ఫెస్టివల్ (పుస్తక మహోత్సవం) ఉండడం వల్ల ఇది అవసరమని కోరుతున్నారు. దీనితో పునరాలోచనలో పడ్డా. గాన పిడిఎఫ్ రూపంలో విడుదల చేసే ప్రయత్నం నిలిపివేసి పునరాలోచన చేయాల్సి వచ్చింది.

పుస్తకం సుమారు 120 పేజీలు వస్తుంది. 500 కాపీలు ముద్రిస్తే ₹30 వేల వరకు ఖర్చు కావచ్చని తెల్సింది. 1000 కాపీలకు ₹50 వేల వరకు ఖర్చు అవుతుందని తెల్సింది.

ఈ పుస్తకం ముద్రణ కోసం ఓ ప్రయోగాత్మక విధానాన్ని చేపడితే ఎలా ఉంటుందని ఆలోచన చేశా. అది మన మిత్రుల ఎదుట పెడుతున్నా.

ఏదేని ప్రచురణ సంస్థ ముద్రణ చేయడానికి ముందుకు వచ్చి కోరితే ఇవ్వడానికి అభ్యంతరం లేదు. లేనిపక్షంలో దీని ముద్రణకు ఎంచుకున్న ప్రయోగాత్మక విధానాన్ని క్రింద తెలుయజేస్తున్నా.

₹1000 చొప్పున ఆర్థిక సాయం చేసే మిత్రుల మీద ఆధారపడి చేసే ప్రయోగమిది. ఒకవేళ దాతల నుండి 500 కాపీల ముద్రణకు తగిన నిధి చేకూరితే, వాటి వరకు ముద్రించాలని భావిస్తున్నా. దాదాపు 30 మంది నుండి ఆదరణ లభిస్తే 500 కాపీల్ని ప్రింట్ చేసుకునే వీలుంది. అంటే సుమారు 30 మంది నుండి ఆదరణ ఉండాలి. దాతల సంఖ్య 1000 కాపీలకు సరిపడితే ఆ మేరకు కూడా ముద్రించే ఆలోచన చేస్తున్నా. అంటే 50 మంది నుండి ఆదరణ రావాలి. 500 కాపీలు ముద్రిస్తే దాతలకు తలకు 10 పుస్తకాలు; 1000 కాపీలు ముద్రిస్తే 15 పుస్తకాల చొప్పున వారి అడ్రెస్సులకు పోస్టు చేయాలని భావిస్తున్నా.

ఇది చదివి మిత్రులెవరూ ఇప్పుటికిప్పుడే ₹1000 నిధిని పంపవద్దు. తొలుత అలా పంపే ఆసక్తిపరుల సంఖ్య నిర్ధారణ జరగాలి. 24 గంటల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నా. మొదట అది నిర్ధారణ జరిగిన తర్వాతే ముద్రణకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాతల సంఖ్య తగినంత వస్తే వెంటనే నిర్ధారించుకొని 24 గంటల తర్వాత తిరిగి మిత్రులకు విజ్ఞప్తి చేస్తా.

ఇచ్చిన దాతల పేర్లు పుస్తకంలో ముద్రించడం జరుగుతుంది. ఇది తమ పేరు పెట్టుకునే కోరిక మిత్రుల్లో వుంటుందనే భావంతో తీసుకున్న నిర్ణయం కాదు. మన మిత్రులు అట్టి కెరీరిస్తులు కారని తెలుసు. వారిని అలా అనుకోవడం లేదు. అట్టి కోణం లేదని స్పష్టం చేస్తున్నా. మిత్రులెవరూ దయచేసి అలా అపార్ధం చేసుకోరని ఆశిస్తున్నా. పారదర్శకత అవసరమని భావించిన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నా.

తమ పేర్లు లేకుండా సాయం చేసే మిత్రుల సాయం తీసుకోలేనని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన ఇబ్బంది వల్ల తమ పేర్లు వెల్లడి కాకూడదని వారి స్థితి అర్ధం చేసుకునేదే. వారు తమ సన్నిహిత మిత్రుల్లో ఒకరి పేరును లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరును సూచిస్తే ఆ పేరే దాతగా ముద్రిద్దాం.

ఈ ప్రయోగాత్మక పద్దతి వల్ల ఒక్కొక్క దాత ఒక్కో ప్రచారకునిగా మారతారు. 10 పుస్తకాల్లో ఒకటి తమ వద్ద భద్రపరుచుకొని మిగిలిన 9 పుస్తకాలను భావ సారూప్యత గల మిత్రులకు అందించే బాధ్యత తీసుకుంటారు. వారిని వెదికే పని కూడా చేపడతారు. ఒకవైపు వారు చరిత్ర ప్రచురణా ప్రక్రియలో మానసికంగా కూడా భాగస్వాములుగా మారతారు. మరోవైపు ఆర్ధిక సాయం చేస్తున్న దాతలుగా మారతారు. ఇంకోవైపు పుస్తకానికి ప్రచారకులుగా కూడా మారతారు. ఈ మూడు బాధ్యతల్ని చేపట్టిన వారౌతారు.

₹1000 కి మించి ఇచ్చే దాతలు కూడా వుంటారు. పుస్తకం ప్రచురిస్తే ₹5000 ఇవ్వడానికి గుంటూరు జిల్లా నుండి ఓ మిత్రులు స్వచ్చందంగా ప్రకటించి వున్నారు. మరో ఇద్దరు మిత్రులు కూడా పుస్తకం ప్రచురిస్తే తాము సాయం చేస్తామని తెలిపారు. ఐతే ఇప్పుడు మరో విధంగా చేస్తున్న కొత్త ఆలోచన ప్రకారం వీలైన ఎక్కువ మంది మానసిక, ఆర్ధిక భాగస్వామ్యతతో పుస్తక ప్రచురణ జరిగితే అదో కొత్త సాంప్రదాయంగా వుంటుందని భావిస్తున్నా.

ఎక్కువమంది సాయంతో పుస్తకం ముద్రణ జరిగితే అదొక ప్రజాస్వామ్య, పారదర్శక సాంప్రదాయం అవుతుంది. ₹5 లేదా ₹10వేల చొప్పున మిక్కిలి వితరణ గుణంతో ఇచ్చే సాయంతో ముద్రణ చేస్తే భాగస్వామ్యత తక్కువ స్థాయిలో వుంటుంది. ముప్పై, నలభై మంది సాయంతో ప్రచురిస్తే అదో పెద్ద భాగస్వామ్యతతో జరిగినట్లు వుంటుంది. తక్కువ నిధి వల్ల ఆర్ధిక భారం తక్కువగా ఉండే సౌలభ్యం ఒకటుంది. అది కూడా పరిగణనలోకి తీసుకునే అంశమే. ఐతే దాని కంటే గరిష్టస్థాయిలో భాగస్వామ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఈ విషయాన్ని మిత్రుల దృష్టిలో ఉంచుతున్నా.

ఈ ప్రయోగాత్మక ప్రక్రియ ఒకవేళ జయప్రదమైతే, మున్ముందు ప్రయోగాన్ని మరింత వికేంద్రీకరణ దిశలో మార్చుకోవచ్చు. మరో ప్రాధాన్యత గల పుస్తక ముద్రణ మరోసారి అవసరమైన సందర్భం వస్తే, తలకు ₹500 ఆర్ధిక సాయంగా మార్చుకొని ప్రచురించుకోవచ్చును. అప్పుడు 100 మంది లేదా ఇంకా ఎక్కువ మంది భాగస్వామ్యంతో ప్రచురణ జరిగినట్లు కదా! ఇదో ఒరవడిగా ఆదరణ పొందితే, దాతల నుండి సాయం ₹100 కి తగ్గిస్తే పుస్తక ప్రచురణ ఒక సహకార ఉద్యమ రూపం తీసుకునే అవకాశం ఉంది. అది ఉద్యమ నిర్మాణ బాధ్యతల్లో ఉన్న నా వంటి వాళ్లకు సాధ్యం కాకపోయినా, అలా చేసే వారికి అదొక ఒరవడిగా ఉపకరిస్తుంది.

నా దృష్టిలో ఉన్న మేరకు పాలస్తీనాపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పుస్తకాల ప్రచురణ జరిగింది. AP లో బుడ్డిగ జమీందారు గారి చొరవ ఫలితంగా పాలస్తీనా స్వేచ్ఛకోసం గళమెత్తుదాం శీర్షికతో ఒక వ్యాస సంకలనం వచ్చింది. తెలంగాణలో స్కైబాబా గారి చొరవతో నేల లేని దేశం శీర్షికతో ఒక కవితా సంకలనం వచ్చింది. పాలస్తీనా పట్ల మోడీ ప్రభుత్వం విద్వేష వైఖరి తీసుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రచురణలు రావడం మంచి పరిణామం. ఈ సంఘీభావ వాణి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఇదో పుస్తకం అవుతుందని ఆశిద్దాం.

ఓ వ్యాస సంకలనం, మరో కవితా సంకలనం ఇంతవరకు వచ్చాయి. మండే మంట గాజా నూరేళ్ళ పాలస్తీనా చరిత్ర శకలాల సంకలనం.

ఈరోజు ఈ పోస్ట్ పెట్టిన తర్వాత 24 గంటలకు సమీక్షిద్దాం. ఎందరి నుండి ₹1000 చొప్పున హామీ వచ్చిందో చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని తిరిగి మిత్రుల వద్ద ప్రకటిద్దాం. మిత్రుల ఆదరణ కోసం వేచి చూస్తాను.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

7pm,

9-12-2023

Subbu

Subbu

Next Story