2024లో సూర్యున్ని తాకనున్న పార్కర్ ప్రోబ్.. మానవ నిర్మిత వస్తువుల్లో అత్యంత వేగం దీనిదే!
మానవుడు ప్రయోగించిన ఏ వస్తువైలోనైనా అత్యధిక వేగం అందుకున్న దానిగా పార్కర్ సోలార్ ప్రోబ్ నిలిచింది. అంతే కాకుండా 2024 డిసెంబరు 24వ తేదీన అత్యధిక వేగంతో సూర్యుణ్ని దాటనుందని నాసా ప్రకటించింది

మానవుడు ప్రయోగించిన ఏ వస్తువైలోనైనా అత్యధిక వేగం అందుకున్న దానిగా పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) నిలిచింది. అంతే కాకుండా 2024 డిసెంబరు 24వ తేదీన అత్యధిక వేగంతో సూర్యుణ్ని దాటనుందని నాసా ప్రకటించింది. ఆ సమయంలో ఇది సెకనుకు 195 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. ఇది న్యూయార్క్ నుంచి లండన్ నగరానికి 30 సెకన్లలో వెళ్లడానికి సమానమని తెలిపింది. ప్రస్తుతం ఇది సూర్యునికి 60 లక్షల కి.మీ. దూరంలో ఉందని నాసా వెల్లడించింది. ఇది కచ్చితంగా సూర్యుని మీద ల్యాండ్ అవ్వడం లాంటిదేనని పార్కర్ మిషన్ సైంటిస్ట్ డా.నౌర్ రవాఫీ అభిప్రాయపడ్డారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లోనే గొప్ప ఘనత.
1969లో చంద్రుని మీద అడుగు మోపడం వంటి ఘనతే ఇదీ కూడా అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ల్యాబరేటరీ సైంటిస్ట్ పేర్కొన్నారు. పార్కర్ సోలార్ ఇంతటి అమోఘమైన వేగాన్ని సూర్యుని గురుత్వాకర్షణ బలం నుంచి పొందుతోంది. 2018లో ఈ మిషన్‌ను ప్రయోగించగా.. సూర్యునికి వీలైనంత దగ్గర వరకు పలుమార్లు తీసుకెళ్లి పరిశోధనలు చేయడమే నాసా లక్ష్యం. ఒక రకంగా ఇది అగ్ని గుండంలో చేసే ప్రయాణమనే చెప్పాలి. సూర్యుని దగ్గరకు వెళ్లేటప్పుడు పార్కర్ ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా 1,400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది.
దీనిని తట్టుకుంటూనే అందులోని పరికరాలు వివరాలు సేకరిస్తున్నాయి. అత్యంత అరుదైన మెటల్స్‌తో తయారుచేసిన ఒక ఉష్ణకవచాన్ని పార్కర్ ప్రోబ్‌కు శాస్త్రవేత్తలు అమర్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మాత్రమే సూర్యునికి అభిముఖంగా ఉండాలి. లేదంటే నిమిషాల్లోనే పార్కర్ పరికరాలన్ని బూడిదలా మారిపోతాయి. 2024లో జరగబోయే ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. చంద్రుని మీదకు మనుషుల్ని పంపి వారిని వెనక్కి తీసుకురావాలని ఆలోచిస్తున్న ఈ తరుణంలో.. పార్కర్ ఇస్తున్న మద్దతు అపురూపమైనది అని నౌరోఫీ చెప్పుకొచ్చారు.