అయస్కాంత తుపానుల వల్ల పక్షులపై దుష్రభావం.. వెల్లడించిన శాస్త్రవేత్తలు

విధాత: అయస్కాంత తుపానుల (Geo Magnetic Storms) వల్ల రేడియో వ్యవస్థ కుప్పకూలడం దగ్గర నుంచి భూమిపై వివిధ వ్యవస్థలు విఫలమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ తుపానులు వినాశనాన్నే కాకుండా నార్తన్ లైట్స్ అనే ఒక ప్రకృతి రమణీయ స్థితిని సృష్టిస్తాయి. నార్వే పరిసరాల్లో అర్ధరాత్రి సమయాల్లో అంతరిక్షంలో వలయాకారంగా తిరిగే కాంతి పుంజాలు ఈ అయస్కాంత తుపానుల వల్లే వస్తాయి. భూమి చుట్టూ ఉండే అంతరిక్ష వలయంలో జరిగే సర్దుబాట్లనే అంతరిక్ష తుపానులుగా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు.
అయితే వీటి వల్ల పక్షులు కూడా ప్రభావితమవుతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అంతరిక్షంలో కలిగే ఈ అయస్కాంత తుపానులు వస్తాయని తెలిసినపుడు, లేదా ఏర్పడినపుడు ఇవి గాలిలోకి ఎగరవని.. ఎక్కడికక్కడ ఉండిపోతాయని తెలుసుకున్నారు. ఎక్కువగా అయస్కాంత క్షేత్రాన్ని అనుసరించే పక్షులు సుదూరంగా ఉన్న తమ గమ్యంవైపు సాగుతాయి. వాటిల్లో వచ్చే తుపానులు వీటిని ప్రభావితం చేయడం ఆశ్చర్యకరం కాదని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ కారణాల వల్ల 9 నుంచి 17 శాతం పక్షులు తమ వలసలను వాయిదా వేసుకుంటున్నాయని వారు వెల్లడించారు. ఈ అధ్యయనం వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా వీరు పావురాలు, పిచ్చుకల వలసలను మ్యాప్ చేసి సమయాలను నివేదికలో పొందుపరిచారు. అయస్కాంత తుపానులు ఏర్పడినపుడు పక్షులు తమ గమ్యాన్ని గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోతాయి.
మనకు ఎదురయ్యే అయోమయ స్థితిలాంటిదే అది. చాలా పక్షి జాతులు ఈ సమయాల్లో తమ వలసలను వాయిదా వేసుకుంటున్నప్పటికీ .. మరికొన్ని కష్టాలు పడుతూ ముందుకు సాగిపోతాయి. అంతే కాకుండా పెద్ద పెద్ద మేఘాలు కమ్మేసినపుడు, ప్రకృతి పరంగా భారీ మార్పులు జరిగినపుడు కూడా వాటి వలసలకు ఇబ్బందికర స్థితి ఎదురవుతుంది. కొన్ని అయితే దిశ తప్పి భూమిని ఢీకొట్టి చనిపోతాయి కూడా అని పరిశోధకులు పేర్కొన్నారు.