మహిళలో క్యాన్సర్‌ను తుడిచి పెట్టేసిన మిరాకిల్ డ్రగ్..

- కీమో, రేడియో థెరపీ లేకుండానే పెద్ద పేగు క్యాన్సర్ మాయం
విధాత: వైద్య శాస్త్రంలోనూ కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు అవి ఎందుకు జరిగాయన్నది అర్థం కాకపోయినప్పటికీ.. ప్రాణాలు మాత్రం నిలబడతాయి. తాజాగా యూకే (UK) లోని వేల్స్‌కు చెందిన ఓ మహిళకు ఎలాంటి ప్రత్యేక చికిత్స లేకుండా మంత్రం వేసినట్లు క్యాన్సర్ రోగం తగ్గిపోయింది. దీనికి కారణంగా వైద్యులు ఆమె తీసుకున్న ఓ ట్యాబ్లెట్ పేరు చెబుతున్నారు. దానికి మిరాకిల్ డ్రగ్ (Miracle Drug) అనే ముద్దు పేరు కూడా పెట్టారు. వేల్స్‌కు చెందిన క్యారీ డోనే (42) కు పెద్ద పేగు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు ఏడాది క్రితం నిర్ధరణ అయింది.
కొన్ని రోజులు ఇతర వైద్య విధానాలను అనుసరించినా ఉపయోగం లేదని భావించడంతో ఆమె డోస్టార్‌లిమాంబ్ అనే మందును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత ఆరునెలలుగా క్యారీ ఈ ఔషధాన్ని తీసుకుంటున్నారు. తాజాగా ఆమె పరీక్ష చేయించుకోగా.. ఆమె శరీరంలో అసలు క్యాన్సర్ కణాల ఉనికే లేకపోవడం చూసి వైద్యులు, క్యారీ కూడా విస్మయానికి గురయ్యారు. సహజమైన ఇమ్యునోథెరపీని అందించే డోస్టార్‌లిమాంబ్ విజయంపై పలు అంచనాలు ఉన్నప్పటికీ.. మొత్తానికి క్యాన్సర్ కణాలను తుడిచిపెట్టేయడం ఆశ్చర్యకరమేనని ఆమెకు చికిత్స చేసిన డా. బారింగ్టన్ పేర్కొన్నారు.
అందుకే ఈ మందుకు వారు మిరాకిల్ డ్రగ్ అనే పేరు పెట్టారు. ఈ డ్రగ్‌ను తీసుకుంటున్నపుడు తాను కీమో, రేడియో థెరపీ లేదా ఎలాంటి సర్జరీలను చేయించుకోలేదని క్యారీ పేర్కొంది. ఈ మందు తీసుకుంటున్నపుడు అప్పుడప్పుడూ బాగా అలసటకు గురయ్యేదాన్ని, అక్కడక్కడా దద్దుర్లు వచ్చేవి అంతకు మించి ఏమీ లేదు. ఏది ఏమైనా కీమో, రేడియో థెరపీలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ బాధే కదా అని చెప్పుకొచ్చింది.
17 ఏళ్ల తన కుమారుడితో ఉంటున్న క్యారీ ప్రస్తుతం తన విధుల్లో చేరడానికి సిద్ధపడుతోంది. తనకు డోస్టార్‌లిమాంబ్‌ను సూచించి ఆరు నెలల పాటు వైద్యం అందించిన డా. బారింగ్టన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆయన నాకు పునఃజన్మను ఇచ్చారు. ఆ సాయం మరిచిపోలేను అని భావోద్వేగానికి గురయింది. తన వద్దకు గతేడాది సుమారు 18 మంది పెద్ద పేగు కేన్సర్‌తో బాధపడుతూ వచ్చారని.. వారికి ఈ మిరాకిల్ డ్రగ్ ఇవ్వగా.. అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డా.బారింగ్టన్ వెల్లడించారు.