Israel-Iran war: ఇరాన్‌పై.. అమెరికా ‘బ్రహ్మాస్త్రం’

ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను నామరూపాల్లేకుండా నాశనం చేయడం ప్రస్తుతం అమెరికా తక్షణ కర్తవ్యం. దానికి కావాల్సింది ఒక బ్రహ్మాస్త్రం. అది ఒక్క అమెరికా వద్దే ఉంది. అదే మాసివ్ ఆర్డ్నెన్స్ పెనెట్రేటర్(ఎంవోపీ) లేదా బంకర్ బస్టర్ బాంబ్.

Israel-Iran war: ఇరాన్‌పై.. అమెరికా ‘బ్రహ్మాస్త్రం’

Israel-Iran war

ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా ఖమేనీ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడంతో, ఇప్పుడు బంతి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ చేతిలో పడింది. తన హెచ్చరికను ఇరాన్​ పెడచెవిన పెట్టడంతో ఇక ఇరాన్​ అంతుచూడందే ట్రంప్​ వదలడు. నేనేం చేస్తానో నాకే తెలియదని పోకిరి డైలాగ్​ ఒకటి వదలిన ట్రంప్​ తన వార్​ రూమ్​లో వివిధ భద్రతాధికారులతో సమావేశమై చర్చలు జరుపుతున్నాడు. ఇరాన్​ అణుశుద్ధి కేంద్రాలను నామరూపాల్లేకుండా నాశనం చేయడం ప్రస్తుతం అమెరికా తక్షణ కర్తవ్యం. దానికి కావాల్సింది ఒక బ్రహ్మాస్త్రం. అది ఒక్క అమెరికా వద్దే ఉంది. అదే మాసివ్​ ఆర్డ్​నెన్స్​ పెనెట్రేటర్​(ఎంవోపీ) లేదా బంకర్​ బస్టర్ బాంబ్​.

టార్గెట్‌ ఫోర్డో అణుశుద్ధి కేంద్రం

ఫోర్డో​ అణుఇంధన శుద్ధి కేంద్రం, ఇరాన్​ (Fordow Nuclear enrichment Centre)– రాజధాని టెహ్రాన్​కు నైరుతి దిక్కున 127 కిమీల దూరంలో ఉంది. ఇక్కడే అణు ఇంధనం, అణ్వాయుధాలలో కీలకంగా వాడే మూలకం యురేనియంను శుద్ధి చేస్తారు. ఇక్కడే ఇరాన్​ అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికాకు, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ(IAEA), ఇజ్రాయెల్​కు ఘంటాపథంగా తెలుసు. ఇప్పటికే అక్కడ 60శాతం శుద్ధిచేయబడిన యురేనియం(Uranium) ఉందని, అది 90శాతానికి చేరితే ఇక అణ్వాయుధాలలో వాడవచ్చని అణుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటువంటిదే మరో కేంద్రం నతాంజ్ (Natanz)​. ఇక్కడ కూడా అదే పనిచేస్తుంటారు కానీ, ఫోర్డోలో జరగుతున్నంత పెద్దయెత్తున కాదు.

దీన్ని నిన్న ఇజ్రాయెల్​ నాశనం చేసిందని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ ధృవీకరించింది. ఇక మిగిలింది ఫోర్డో. ఫొర్డో అణుఇంధన శుద్ధి కేంద్రం సమీప పట్టణమైన ఖోమ్​కు 15 మైళ్ల దూరంలో పర్వతప్రాంతంలో ఉంది. ఏకంగా ఒక పర్వతపాదాన్ని తొలిచి, సరిగ్గి ఆ పర్వతం కింద చాలా లోతులో ధృడమైన రాతి, కాంక్రీట్​, ఇనుప గోడలతో నిర్మించారు. ప్రతి ద్వారం కూడా భారీ పేలుడును కూడా తట్టుకునేలా తయారుచేసారు. దాదాపు 300 అడుగుల లోతులో ఈ కేంద్రాన్ని నెలకొల్పారని సమాచారం. ఖచ్చితమైన లోతు అమెరికా, ఇజ్రాయెల్​కు తెలిసేవుంటుంది. ఈ కేంద్రమే ఇప్పుడు అమెరికాకు, ఇజ్రాయెల్​కు నిద్రపట్టకుండా చేస్తోంది. దాన్ని పూర్తిగా భస్మీపటలం చేయడమే వారికి కావాలి. ఆ పని చేయగలిగిందే ఈ బంకర్​ బస్టర్​ బాంబు.

చిన్న సైజు రాకెట్‌లా..

మాసివ్​ ఆర్డ్​నెన్స్​ పెనెట్రేటర్​ లేదా బంకర్​ బస్టర్​ బాంబ్​. 13,600 కిలోల బరువుతో, 20.5 అడుగుల పొడవులో, 32 అంగుళాల వ్యాసంతో చూడ్డానికే చిన్నపాటి రాకెట్​లా ఉంటుంది. దీన్లో ఖచ్చితమైన లేజర్​ ఆధారిత గైడింగ్​ వ్యవస్థతో లక్ష్యాన్ని గురిచూసుకుని పేల్చగలదు. దీని బాహ్య కవచం(Outer case) ఇగ్లిన్​ ఉక్కుమిశ్రమ లోహాలతో, అత్యంత పటిష్టంగా తయారుచేసారు. పెద్ద పెద్ద భవంతుల సెల్లార్లు, పర్వత గుహలు, భూగర్భ నిర్మాణాలు, ధృఢమైన కాంక్రీట్​ గోడలను తొలుచుకుంటూ వెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం.

కేవలం ఈ ఉపయోగం కోసమే ఈ బాంబును తయారుచేసారు. జిబియు–57(GBU-57) మాడల్​ నెంబర్​తో పిలవబడే ఈ బాంబులో ఇంకా ఇతర రకాలు కూడా ఉన్నాయి. సైనిక బాహుళ్యంలో ఉన్న సమాచారం మేరకు జిబియు–57ఏ/బి(GBU-57A/B), జిబియు–57ఈ/బి అనే రెండు రకాల బాంబులున్నట్లు తెలిసింది. ఈ రెండు దాదాపు 200 అడుగుల(200 feet) లోతు వరకు తొలుచుకుంటూ వెళ్లి విధ్వంసం సృష్టించగలవు. ఇవి కాక, ఇంకో రెండు ఆధునీకరించబడ్డ రకాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

బీ2 స్టెల్త్‌ బాంబర్‌తోనే ప్రయోగం

ఇంత బరువు, సైజున్న బాంబును మోసుకెళ్లి జారవిడువగల సామర్థ్యం ఉన్న బాంబర్​ విమానం ఒకే ఒకటి. అదే బి-2 రహస్య బాంబర్(B-2 Spirit Stealth Bomber)​. ఇది కూడా ఒక్క అమెరికా వద్దే ఉంది. ఒక్క బి-2, రెండు జిబియులను తీసుకెళ్లగలుగుతుంది. ఇప్పుడు ఈ బాంబర్​, ఆ బాంబు రెండే ఫోర్డో కేంద్రం లోపలకి చొచ్చుకెళ్లి నాశనం చేయగలవు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫోర్డో కేంద్రం దాదాపు 300 అడుగుల లోతులో ఉంది. ఈ బంకర్​ బస్టర్​ బాంబు వెళ్లగలిగే లోతు 200 ఫీట్లు మాత్రమే. ఈ మాట దాదాపు 10 ఏళ్ల కిందటిది. మరి ఇప్పుడు ఆధునీకరించబడ్డ జిబియులు ఇంకా ఎంత లోతుకు వెళ్లగలవు అనేది అమెరికా వాయుసేనకు తప్ప ఎవరికీ తెలియదు.

ఈ బి–2 స్పిరిట్​ స్టెల్త్​ బాంబర్​(B-2 stealth bomber) కూడా చాలా ప్రత్యేకమైన విమానం. ఈ బాంబర్​ చాలా పెద్ద పెద్ద బాంబులను తీసుకెళ్లడానికి వాడతారు. అవి గైడెడ్​ బాంబులు, అణుబాంబులు, బంకర్​ బస్టర్​ బాంబులను తీసుకెళ్లగలిగే ఈ విమానం, ఇద్దరు పైలట్​లతో, రాడార్​లకు దొరక్కుండా, ఎక్కడా అగకుండా 11వేల కిలోమీటర్లు ఎగిరే సత్తా కలిగిఉంటుంది. ఒకసారి మధ్యలో ఇంధనం నింపుకుంటే 20వేల కిమీ కూడా వెళ్లగలదు. 50వేల అడుగుల ఎత్తు నుండి కూడా దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సమాచార వ్యవస్థలు, రహస్య ప్రయాణ వ్యవస్థలు దీన్లో భాగంగా ఉన్నాయి.

సక్సెస్‌ అయ్యేనా?

అమెరికా జిబియు–57ఏ/బి, జిబియు–57ఈ/బి రకాలను వాడాలనుకుంటే, లోతు సమస్య ఎదురవుతుంది. 300 ఫీట్ల లోతు వరకు ఒక్క బాంబు వెళ్లలేదు కాబట్టి, అదే లక్ష్యంపై రెండో బాంబును కూడా వేయాలి. అప్పుడు మొదటిది తొలుచుకుంటూ వెళ్లిన మార్గంలో 200 అడుగుల వరకు ఎటువంటి బలప్రయోగం లేకుండా వెళ్లి, అక్కన్నుండి అది పని ప్రారంభిస్తే లక్ష్యం పక్కాగా నెరవేరుతుంది. అయితే ఇదంతా ఎయిర్​ఫోర్స్​ తీసుకునే నిర్ణయాలు, వారి సాంకేతిక అంశాలతో ముడిపడిఉంటుంది. ఒక బాంబు వెనుక, మరో బాంబు వేయాలంటే అదే లక్ష్యంపై గురిపెట్టాలంటే కొంత వ్యవధి అవసరమని రక్షణ నిపుణుల అభిప్రాయం. ఆ వ్యవధిలో ఫోర్డో చుట్టూ మోహరించబడి ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు(Iran Air defence systems) చూస్తూ ఊరుకోవు కదా. అవి బి2 బాంబర్​ను పేల్చే ప్రయత్నం చేస్తాయి. పేల్చేసినా, బి2 తప్పించుకున్నా, పని పూర్తికానట్లే. ప్రస్తుతం ఇదే సందేహం అందరినీ పట్టి పీడిస్తోంది.

అయితే ఆధునీకరించబడిన మరో రెండు రకాలుగా చెప్పబడుతున్న జిబియు–57లు మరింత లోతులకు చొచ్చుకెళ్లగలగడమే వాటి ప్రత్యేకతలై ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, దాడికి బయల్దేరేది ఒక్క బి–2నే కాకుండా ఇంకా రెండు స్టెల్త్​ ఫైటర్​ జెట్ల(Stealth fighter jets)ను కొంచెం ముందుగా పంపిస్తే, అవి ఫోర్డో గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాయి. ఆ తరువాత బి–2 తన పనిని నిరాటంకంగా పూర్తిచేసుకోవచ్చు. ఎఫ్​–22(F-22) స్టెల్త్​ ఫైటర్ జెట్లు ఈ పనికి బాగా అక్కరకొస్తాయని అమెరికా వాయుసేన మాజీ అధికారి ఒకరు చెప్పారు. బహుశా అదే అమెరికా అధ్యక్షుడి ధైర్యానికి కారణమని యుద్ధనిపుణులు భావిస్తున్నారు. ఇంతవరకు ఈ బంకర్​ బస్టర్​ బాంబులను యుద్ధంలో వాడలేదు. ఇప్పడు అవి రంగప్రవేశం చేస్తే ఇదే మొదటిసారి నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్టవడమే కాక, వాటి సత్తా ఏంటో ప్రపంచానికి కూడా తెలిసే అవకాశముంది.