మెక్సికో న‌గ‌రంపై హ‌రికేన్ విధ్వంసం.. 39 మంది మృతి

  • Publish Date - October 29, 2023 / 09:07 AM IST

మెక్సికో (Mexico) లోని ఓ హ‌రికేన్ (Hurricane) తీవ్ర విధ్వంసం సృష్టించింది, ఓటిస్ అనే పేరుతో పిలిచిన ఈ ఐదో కేట‌గిరీ హ‌రికేన్ దేశంలోని ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క స్థ‌ల‌మైన అకాప్యుల్కోను స‌ర్వ‌నాశనం చేసింది. బుధ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు దీని ప్ర‌భావం ఈ న‌గ‌రంపై ప‌డింది. దీని బారిన ప‌డి క‌నీసం 39 మంది మ‌ర‌ణించార‌ని.. శిథిలాల కింద మ‌రింత మంది ఉండొచ్చ‌ని అధికారులు ఆదివారం వెల్ల‌డించారు. వివిధ భ‌వనాలు, దుకాణ‌స‌ముదాయాలు నేల‌మ‌ట్టం కావ‌డంతో భారీ స్థాయిలో ఆస్తి న‌ష్టం కూడా సంభ‌వించింది.


విద్యుత్‌, తాగునీరు స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఇంకా పున‌రుద్ధ‌ర‌ణ కాక‌పోవ‌డంతో త‌మ వారు క్షేమంగానే ఉన్నారో లేదోన‌ని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న‌వారు ఆవేద‌న చెందుతున్నారు. సుమారు 2 ల‌క్ష‌ల ఇళ్లు నేల‌మ‌ట్టం కావ‌డంతో.. వారికి శిబిరాలు నిర్వ‌హించ‌డం ప్ర‌భుత్వానికి క‌ష్ట‌త‌రంగా మారింది. పురాత‌న క‌ట్ట‌డాల‌కు ప్ర‌సిద్ధి చెందిన ఈ న‌గ‌రంపై బాంబు దాడి జ‌రిగినట్లు ఉంద‌ని న‌గ‌ర మేయ‌ర్ పేర్కొన్నారు. అకాప్యుల్కోను వీలైనంత త్వ‌ర‌గా పునఃనిర్మిస్తామ‌ని దేశ అధ్య‌క్షుడు ఆండ్రెస్ మాన్యువ‌ల్ లోపెజ్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.


సుమారు ఇక్క‌డ 1500 కోట్ల డాల‌ర్ల న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని ఒక అంచ‌నా. దేశ త్రివిధ ద‌ళాలు, పోలీసు బృందాలు స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఈ కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చిన హ‌రికేన‌ల్లో ఓటిస్ రెండోద‌ని ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ తెలిపింది. 2015లో పాట్రీసియాలో వ‌చ్చిన హ‌రికేన్ మాత్ర‌మే దీనికంటే తీవ్ర‌మైన‌ద‌ని వెల్ల‌డించింది. ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి స‌మ‌యమే లేనంత స్థాయిలో ఇది వేగంగా దూసుకొచ్చింద‌ని పేర్కొంది.

Latest News