ప‌రాన్న‌జీవుల్లా నా ఇంట్లో ప‌డి తింటున్నారు.. కుమారులపై కోర్టుకెక్కిన వృద్ధురాలు

ప‌రాన్న‌జీవుల్లా నా ఇంట్లో ప‌డి తింటున్నారు.. కుమారులపై కోర్టుకెక్కిన వృద్ధురాలు

ఉద్యోగాలు చేసుకుంటూ.. వ‌య‌సు 40 ల్లోకి వ‌చ్చినా త‌న కుమారులు ఇద్ద‌రూ ప‌రాన్న‌జీవుల్లా (Parasite Sons) త‌న ఇంట్లో ప‌డి తింటున్నార‌ని ఓ వృద్ధురాలు కోర్టు మెట్లు ఎక్కింది. వారిని త‌న ఇంటి నుంచి వెళ్లిపోయేలా ఆదేశించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఉత్త‌ర ఇటలీ (Italy) లోని పావియా ప్రాంతంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అక్క‌డి ప‌త్రిక‌లు క‌థ‌నాలు వెలువ‌రించాయి. పిటిష‌న్ దాఖ‌లు చేసిన 75 ఏళ్ల వృద్ధురాలికి 42, 40 ఏళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వారు ఇద్ద‌రు ఉద్యోగాలు చేస్తున్నా.. వేరే ఇంటికి మార‌కుండా త‌ల్లితోనే ఉంటూ వ‌స్తున్నారు.


అయినా ఇంటి ఖ‌ర్చుల‌కు ఎప్పుడూ డ‌బ్బులు ఇచ్చేవారు కాదు. రోజువారి ప‌నుల్లోనూ ఒక చేయి వేసిన పాపాన పోలేదు. దీంతో ఆ వృద్ధురాలికి చిర్రెత్తుకొచ్చేది. దాంతో వారిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోమ్మ‌ని, వేరే ఇంటిలో ఉంటూ ఎప్పుడైనా చూడ‌టానికి ర‌మ్మ‌ని చెప్పేది. అయినా వారు అమ్మ మాట‌ను ల‌క్ష్య‌పెట్ట‌లేదు. వారి తీరు మార‌క‌పోవ‌డం, ఇంటి నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించారు.


కేసుని విచారించిన జ‌డ్జి సైమోనా కాట‌ర్‌బీ.. వృద్ధురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆవిడ ఇద్ద‌రు కుమారులూ డిసెంబ‌రు 18లోపు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల‌ని ఆదేశించారు. పిటిష‌న్‌దారు భ‌ర్త నుంచి విడిపోయి.. పింఛ‌న్ సాయంతో జీవిస్తున్నార‌ని జ‌డ్జి గుర్తించారు. కుమారులిద్ద‌రూ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఆర్థికంగా సాయం చేయ‌లేద‌ని.. ఆవిడ పింఛ‌న్ సొమ్మంతా ఆ ఇద్ద‌రు బిగ్ బేబీస్‌కే స‌రిపోతోంద‌ని త‌న తీర్పులో వ్యాఖ్యానించారు. దీంతో మ‌హిళ‌కు న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.