Kolkata trainee doctor case । కోల్‌కతా మెడికో కేసులో కీలక ట్విస్టు.. నేరంలో ఉన్నది ఒక్కడేనా?
కోల్‌కతా మెడికోపై హత్యాచారం కేసులో మరో ట్విస్టు ఎదురైంది. ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డీఎన్ఏ రిపోర్టులు సంచలన విషయాన్ని బయటపెట్టాయి.

Kolkata trainee doctor case । కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ పీజీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటన రోజుకో మలుపు తీసుకుంటున్నది. ఈ కేసులో ఇప్పటి వరకూ 200 మందికిపైగా సీబీఐ అధికారులు విచారించారు. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ను సైతం ప్రశ్నించారు. ఆయన అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ఈడీ సైతం రంగంలోకి దిగింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఒకే ఒక వ్యక్తి సంజయ్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఒకరికి మించి భాగస్వాములయ్యారనే అభిప్రాయాన్ని పోస్టుమార్టం నివేదిక సైతం వ్యక్తం చేసింది. ఆమె శరీరం నుంచి సేకరించిన ద్రవం 150 మిల్లీలీటర్ల వరకూ ఉన్నదని, దీన్ని బట్టి ఒక్కరే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పలేమని అధికారులు సైతం అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదంటూ ఈ కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందన్న వాదనను సీబీఐ అధికారులు తోసిపుచ్చుతున్నారని సమాచారం. ఈ ఘాతుక నేరంలో సంజయ్ రాయ్ భాగస్వామ్యాన్ని డీఎన్ఏ పరీక్షలు సైతం నిర్ధారించాయని చెబుతున్నారు. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరంలో భాగస్వామి అని, మరొకరికి ఇందులో పాత్ర లేదని డీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. మృతురాలి శరీరం నుంచి సేకరించిన నమూనాలతో సంజయ్ రాయ్ డీఎన్ఏ సరిపోలిందని సమాచారం. ఈ కేసులో ఇతడు ఒక్కడే నిందితుడని పేర్కొన్నట్టు తెలిసింది.
ఘటన జరిగిన మరుసటి రోజు కూడా కళాశాలలో మరమ్మతు పనులు కొనసాగిన నేపథ్యంలో ఘటనాస్థలంలో ఆధారాలు ధ్వంసమయ్యేందుకు ఉన్న అవకాశాలపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టిసారించింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో పలు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సైతం సీబీఐ సేకరించింది. ఘటన జరిగిన సమయంలో సంజయ్రాయ్ సెమినార్ హాల్లోనే ఉన్నట్టు సీబీఐ అధికారులు ధృవీకరించుకున్నారు.ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్నది. ఇప్పటి వరకూ సుమారు 200 మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే.. భిన్న అభిప్రాయాలు ఈ సందర్భంగా వచ్చాయి. ఈ ఘటనలో చార్జిషీటును పకడ్బందీగా నమోదు చేసేందుకు సీబీఐ అధికారులు కృషి చేస్తున్నారు.
ఆగస్ట్ 9వ తేదీన మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఈ కేసులో అదే రోజు సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజు అప్పటికి కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్.. డ్యూటీ డాక్టర్లు ఉపయోగించే టాయిలెట్లు, గదుల్లో వెంటనే మరమ్మతులకు ఆదేశించారు. అయితే.. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో వాటిని నిలిపివేశారు. ఈ సమయంలో ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయా? అనే కోణంలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.