విధాత, హైదరాబాద్: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో రాహుల్ అనే యువకుడు గురువారం రాత్రి రెండు గంటల పైగా చిక్కుకుపోయాడు. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయిన సమాచారం అందుకోవడంలో..సహాయక చర్యలలో సిబ్బంది నిర్లక్ష్యంతో బాధితుడు రెండు గంటల పాటు లిఫ్టులోనే భయాందోళనల మధ్య ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం విమర్శలకు తావిచ్చింది.

రాహుల్ (20) అనే యువకుడు ఉప్పల్‌లోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ ఎన్‌ఆర్‌పీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తున్న సమయంలో నిన్న రాత్రి 6-బీ స్కైవాక్ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు దాదాపు 2గంటలకు పైగా శ్రమించారు. చివరికి టెక్నీషియన్లు ఆలస్యంగా రాత్రి 1:15 గంటల సమయంలో బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు.

లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కన్‌స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్‌ఎండీఏ అధికారుల నుంచి సకాలంలో స్పందన లేకపోవడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన ఘటనపై బాధితుడు రాహుల్ స్పందిస్తూ.. తాను హార్ట్ పేషంట్ అని సరైన శ్వాస అందక ఇబ్బంది పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. సహాయక చర్యలలో ఇంత జాప్యం ఉంటుందని తాను ఊహించలేదని..తాను బతుకుతానో లేదోనన్న ఆందోళనకు గురయ్యానని వాపోయాడు. మరోసారి లిఫ్టులతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.