ఈ ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించిందని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడుతామని, ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ

- త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ
- కేసీఆర్ పాలనలో వారి కుటుంబానికే ఉద్యోగాలు
- వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టానే మీకు ఉద్యోగాలొచ్చాయి
విధాత : మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించిందని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడుతామని, ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో 6,956మంది నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను సీఎం రేవంత్రెడ్డి అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నామన్నారు. మీ కళ్ళల్లో ఆనందం చూసి..ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదన్నారు. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులేనన్నారు. నిరుద్యోగుల త్యాగాల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదన్నారు.
వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే… మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండన్నారు. హారీష్ రావు పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదన్నారు. కనీసం కేసీఆర్ అయిన అల్లుడిని పిలిచి గడ్డి పెట్టాలన్నారు. అవాకులు చెవాకులు పలకడం కాదని, ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండని హితవు పలికారు. గత ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలివ్వలేదని, కేసీఆర్ తన బిడ్డకు ఎంపీ పదవి పోగానే ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇచ్చుకున్నాడన్నారు. స్టాప్ నర్సుల ఉద్యోగ సమస్య పెండింగ్లో ఉన్నదని తెలిసి వెంటనే సమీక్షించి భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అప్పులు..ఆర్ధిక భారమైనా ఉద్యోగాల భర్తీ హామీ నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదరం రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.