అమాయకత్వంతో బాలికలు ఏం చేశారంటే..
అభిమాన హీరోలను, వ్యక్తులను కలిసేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తారు. ఎన్ని వ్యయ ప్రయాసలైనా పడతారు. ఎంతదూరమైనా వెళ్తారు

- దక్షిణ కొరియాకు వెళ్లేందుకు ఇంటి నుంచి పారిపోయిన ముగ్గురు తమిళనాడు బాలికలు
- కొరియన్ పాప్ బ్యాండ్‌ను కలిసేందుకు సాహసం
- వెల్లూరు రైల్వేస్టేషన్‌లో విద్యార్థినుల గుర్తింపు
- తల్లిదండ్రులకు తిరిగి విద్యార్థినుల అప్పగింత
- వారంతా 8వ తరగతి చదివే 13 ఏండ్ల బాలికలు
విధాత: అభిమాన హీరోలను, వ్యక్తులను కలిసేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తారు. ఎన్ని వ్యయ ప్రయాసలైనా పడతారు. ఎంతదూరమైనా వెళ్తారు. సాధ్యాసాధ్యాలను అస్సలు పట్టించుకోరు. గతంలో ఇలా కొందరు లక్ష్యం సాధించారు. మరికొందరు విఫలమయ్యారు. తాజాగా తమిళనాడుకు చెందిన 8వ తరగతి చదివే 13 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలికలు ఇలాంటి సాహసమే చేశారు. దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ అంటే ఈ ముగ్గురు బాలికలకు చెప్పలేనంత ఇష్టం. వారిని కలిసేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. పాస్‌పోర్టు కూడా లేకుండా కేవలం రూ.14,000తో దక్షిణ కొరియా రాజధాని సియోల్ వెళ్లేందుకు సాహస యాత్ర చేపట్టారు. చివరి వెల్లూరు వద్ద పోలీసులకు చిక్కారు. పోలీసులు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అసలు సంగతి ఏమిటంటే.. తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు స్థానిక పంచాయతీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ (బియాండ్ ది సీన్) అంటే ఎంతో ఇష్టం. మిగతా ఇద్దరికి కూడా ఆ బ్యాండ్ గురించి పరిచయం చేసింది. బ్యాండ్ వీడియోలు చూడటం వల్ల ముగ్గురూ అభిమానులుగా మారిపోయారు.
తమ ప్రియమైన కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్‌ను కలవడానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ అమాయకత్వంతో ఇన్నాళ్లు కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న రూ. 14,000తో సియోల్ చేరుకోవడానికి ఇంటర్నెట్ సమాచారంతో ఒక ప్రణాళికను రూపొందించారు. ముందుగా రోడ్డు మార్గాన ఊరు నుంచి చెన్నైకి రైలు ఎక్కాలని ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం చేరుకొని, అక్కడ నుంచి దక్షిణ కొరియాకు షిప్‌లో వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ముగ్గురు బాలికలు జనవరి 4 న ఇండ్ల నుంచి బయలుదేరారు. రోడ్డు మార్గాన చెన్నైకి చేరి అక్కడ ఒక హోటల్‌లో ఉన్నారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో బాలికల కుటుంబసభ్యులకు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు. మరుసటి రోజు బాలికలు చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఎక్కారు. అర్ధరాత్రి ఆహారం కొనుగోలు చేసేందుకు వెల్లూరు జిల్లా కాట్పాడి జంక్షన్‌లో దిగిన వీరు రైలు మిసయ్యారు. అప్పటికే ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు కాట్పాడి జంక్షన్ సమీపంలో బాలికలను గుర్తించి రక్షించారు. వేలూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనల మేరకు పోలీసులు వారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాలల గృహానికి పంపించారు. ఈ నెల 6న బాలికలు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించారు.
ఒక బాలికకు సింగిల్ పేరెంట్ కాగా, మరొక అమ్మాయి తండ్రి మానసిక వికలాంగుడు. ఈ అమ్మాయిల తల్లులు వ్యవసాయ కూలీలు. పిల్లలను పర్యవేక్షించడానికి వారికి సమయం లేదు. పిల్లలు ఏమి చేస్తున్నారు? ఏమి కోరుకుంటున్నారు అనేది వారికి తెలియదు. అమాయకత్వంలో మునిగిన పిల్లలు సియోల్ వెళ్లాలనుకున్నారు.