బీజేపీ విజయోత్సవ ర్యాలీ.. కమలనాథులపై వేడి నీళ్లతో దాడి..
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 230 స్థానాలకు గానూ బీజేపీ 163 స్థానాల్లో గెలుపొంది, అధికారాన్ని చేజిక్కించుకుంది.

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 230 స్థానాలకు గానూ బీజేపీ 163 స్థానాల్లో గెలుపొంది, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు తీశారు. ఇండోర్‌లో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నాయకులపై వేడి నీళ్లతో దాడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లోని ఖజ్రానా పోలీసు స్టేషన్ పరిధిలో బీజేపీ నాయకులు ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వకీల్ పఠాన్ అనే వ్యక్తి ఆ ర్యాలీని అడ్డుకున్నారు. తన నివాసం ముందు ర్యాలీ చేయొద్దని కోరాడు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా.. ఆవేశంతో ఊగిపోయిన పఠాన్ ఫ్యామిలీ తన ఇంటి పైనుంచి ర్యాలీలో పాల్గొన్న వారిపై వేడి నీళ్లతో దాడి చేశాడు. దీంతో కమలనాథులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.