చిరుత దాడిలో 8 ఏండ్ల బాలిక మృతి
తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్న ఓ బాలికను చిరుత అపహరించి, చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుహెల్వా ఫారెస్టు పరిధిలోని భగవాన్‌పూర్ కోదార్ గ్రామంలో వెలుగు చూసింది.

లక్నో : తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్న ఓ బాలికను చిరుత అపహరించి, చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుహెల్వా ఫారెస్టు పరిధిలోని భగవాన్‌పూర్ కోదార్ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భగవాన్‌పూర్ కోదార్ గ్రామానికి చెందిన అనుష్క(8) అనే బాలిక తన స్నేహితులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. గ్రామ సమీపంలో ఆడుకుంటున్న పిల్లలను ఓ చిరుత గమనించింది. అక్కడే ఉన్న పొదల చాటున మాటు వేసింది చిరుత. పిల్లలు ఆటలో నిమగ్నమై ఉండగా, అనుష్కపై దాడి చేసి అపహరించింది.
తీవ్ర భయాందోళనకు గురైన పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో, గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. చిరుత నుంచి బాలికను విడిపించేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోదార్ గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. సమీప అడవుల్లో చిరుత కోసం గాలించారు. ఈ క్రమంలో బాలిక మృతదేహం లభ్యమైంది.
నెల రోజుల కాలంలో ఐదుగురిని చంపిన చిరుతను పట్టుకునేందుకు కోదార్ గ్రామ సమీపంలో అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు. చెరుకు తోటల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులను అధికారులు హెచ్చరించారు.