Telangana | 9 మంది మంత్రులకు సంక‌టం.. 35 నుంచి 45 స్థానాల‌కు పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్‌

Telangana | 50 స్థానాల్లో బీఆరెస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్‌ బీఆరెస్‌ గట్టెక్కాలంటే 30 మందిని మార్చాలి? పార్టీ అధిష్ఠానానికి పీకే బృందం సూచనలు? కాంగ్రెస్‌ జాబితా కోసం బీఆరెస్‌ ఎదురుచూపు! మహిళా బిల్లు ఆమోదం పొందినా మార్పులే? విధాత‌, హైద‌రాబాద్‌: ‘కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. బీఆరెస్ గ్రాఫ్ త‌గ్గుతున్నది. మ‌రి బ‌య‌ట ప‌డేదెలా?’ ఇప్పుడు బీఆరెస్‌లో ఈ విషయంలో తీవ్ర అంతర్మథనం జరుగుతున్నదని చెబుతున్నారు. ఇప్పుడు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌ను అలాగే పోటీకి దింపితే బీఆరెస్‌ […]

  • By: Somu    latest    Sep 07, 2023 12:15 AM IST
Telangana | 9 మంది మంత్రులకు సంక‌టం.. 35 నుంచి 45 స్థానాల‌కు పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్‌

Telangana |

  • 50 స్థానాల్లో బీఆరెస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్‌
  • బీఆరెస్‌ గట్టెక్కాలంటే 30 మందిని మార్చాలి?
  • పార్టీ అధిష్ఠానానికి పీకే బృందం సూచనలు?
  • కాంగ్రెస్‌ జాబితా కోసం బీఆరెస్‌ ఎదురుచూపు!
  • మహిళా బిల్లు ఆమోదం పొందినా మార్పులే?

విధాత‌, హైద‌రాబాద్‌: ‘కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. బీఆరెస్ గ్రాఫ్ త‌గ్గుతున్నది. మ‌రి బ‌య‌ట ప‌డేదెలా?’ ఇప్పుడు బీఆరెస్‌లో ఈ విషయంలో తీవ్ర అంతర్మథనం జరుగుతున్నదని చెబుతున్నారు. ఇప్పుడు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌ను అలాగే పోటీకి దింపితే బీఆరెస్‌ అధికారం చేజిక్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని పీకే టీఎం సర్వేలో తేలిందని సమాచారం.

వీరిలో క‌నీసం 30 మందిని మార్చితే గానీ బీఆరెస్‌ ప్ర‌భుత్వం క‌నీస మెజార్టీతో బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని ప్ర‌శాంత్ కిశోర్ ఇప్ప‌టికే నివేదిక ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జరుగుతున్నది. కింక‌ర్త‌వ్యంపై ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్నదని అంటున్నారు. పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల్లో మ‌హిళా బిల్లు ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తే, ఆ పేరు మీద మారిస్తే గొడ‌వ ఉండ‌ద‌నే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నదని చెబుతున్నారు.

షాకింగ్ విష‌యం ఏంటంటే, ఇప్పుడున్న 18 మంది కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌ను మిన‌హాయిస్తే 16 మందిలో 9 మంది మంత్రులు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నార‌ని పీకే తేల్చారని సమాచారం. వారిని ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌టం అంత సుల‌భం కాద‌ని కూడా చెప్పిన‌ట్టు ప్ర‌చారం జరుగుతున్నది. ఆ 9 మందిని ఏం చేయాల‌న్న దానిపై కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే, దానిని బ‌ట్టి అభ్య‌ర్థుల మార్పు విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకుంటారన్న అంచనాలు వెలువడుతున్నాయి.

కాంగ్రెస్‌పై పాలుపోసిన బీఆరెస్‌ జాబితా

బీఆరెస్ అభ్య‌ర్థుల‌ను సీఎం కేసీఆర్‌ ప్ర‌క‌టించిన త‌రువాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 35 నుంచి 45 స్థానాల‌కు పెరిగిన‌ట్లు తెలిసింది. సిట్టింగ్‌ల‌ను మారుస్తార‌ని గ‌తంలో జ‌రిగిన ప్ర‌చారంతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌త్యామ్నాయ లీడ‌ర్లు ముందుకు వ‌చ్చారు. టికెట్ల ఆశించే వారి సంఖ్య బాగా పెరిగింది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆరెస్‌లో చేరిన వారి నియోజ‌కవ‌ర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు ఈసారి త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు. ఇలా బీఆరెస్‌లో టికెట్ ఆశించే వారి సంఖ్య ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో రెండు నుంచి మూడుకు చేరింది.

అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌రువాత చూస్తే అంతా పాతకాపులే కావ‌డంతో టికెట్ ఆశించిన నాయ‌కులంతా దిగాలుపడ్డారు. కొంతమంది తిరుగుబాటు ప్ర‌క‌టించారు. మ‌రికొన్ని చోట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతోపాటు, అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌, ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌తోపాటు అసంతృప్త నేత‌ల తిరుగుబాట్లు బీఆరెస్‌కు న‌ష్టం తెచ్చేలా ఉన్నాయి.

ఈ క్రమంలోనే బీఆరెస్‌ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో ఉన్న మంత్రుల‌లో 9 మంది ప‌రిస్థితి సంక‌టంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో బీఆరెస్ అభ్య‌ర్థుల పోగ్రెస్ స‌రిగా లేద‌ని ఈ స‌ర్వేలో తేలిన‌ట్లు స‌మాచారం. ఇందులో 30 మంది ప‌రిస్థితి అస‌లు బాగాలేద‌ని, వీరిని మారిస్తేనే బీఆరెస్‌కు మేలు జ‌రుగుతుంద‌ని సీఎం కేసీఆర్‌కు పీకే స్ప‌ష్టం చేసిన‌ట్ల రాజకీయ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారంతో పాటు, అభ్య‌ర్థుల ప‌ట్ల కూడా ప్ర‌జ‌ల్లో సానుకూల వాతావ‌ర‌ణం లేద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తున్నది.

50 స్థానాల్లో నువ్వా..నేనా..

బీఆరెస్ అభ్య‌ర్థుల గ్రాఫ్ ప‌డిపోతుండ‌గా, కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతున్నదని స‌ర్వే నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 35 నుంచి 45 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పై చేయిలో ఉంద‌ని, మ‌రో 50 స్థానాల్లో బీఆరెస్‌, కాంగ్రెస్ మ‌ధ్య నువ్వా.. నేనా అన్న‌ట్లుగా ట‌ఫ్ ఫైట్ ఉంద‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక‌లో పైర‌వీల‌కు తావు లేకుండా స‌ర్వేలు, నాయ‌కుల ప‌నితీరు ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటే బీఆరెస్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కూడా చెప్పిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జరుగుతున్నది.

ఈ నేప‌థ్యంలో 9 మంది మంత్రుల‌తో క‌లిపి దాదాపు 30 వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను మారిస్తేనే బెట‌ర్ పొజిషన్‌ ఉంటుంద‌ని రిపోర్ట్ ఇచ్చిన‌ట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్‌, రంగారెడ్డి జిల్లాల్లో బీఆరెస్ ప‌రిస్థితి అంత‌బాగా లేద‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నది.

కాంగ్రెస్ జాబితా ప్ర‌క‌ట‌న త‌రువాతే

కాంగ్రెస్ జాబితా ప్ర‌క‌టించిన త‌రువాత అభ్య‌ర్థుల బ‌లాబ‌లాలను అంచనా వేసి.. అప్పుడు బీఆరెస్‌ అభ్యర్థుల మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు సీఎం వేచి చూసే అవకాశాలే ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థుల ఖరారు విషయంలో ఇప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. అభ్య‌ర్థుల ఎంపిక పూర్తి కావ‌డానికి స‌మ‌యం తీసుకునే ప‌రిస్థితి కనిపిస్తున్నది.

ఈ నెల‌ 18 నుంచి పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదం పొంది అమ‌లులోకి వ‌స్తే చ‌ట్ట స‌భ‌ల్లో విధిగా 33.3% రిజ‌ర్వేష‌న్లు మ‌హిళ‌ల‌కు కేటాయిస్తారు. ఈ మేర‌కు అభ్య‌ర్థుల జాబితాలో కూడా మార్పులు చేయాల్సి వ‌స్తుంది. ఇలా ఈ నెల‌లో జ‌రుగ‌నున్న రాజ‌కీయ మార్పులు, స‌మీక‌ర‌ణ‌ల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను మారిస్తే కేసీఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.