నాసా ఏంటి క్యాబేజీ ఫొటో పెట్టింది అనుకున్నారు.. తీరా చూస్తే!

విధాత: నాసా (NASA) తన అధికారిక ఇన్‌స్టా పేజీలో తన పరిశోధనలకు సంబంధించిన అంశాలను యూజర్లతో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక క్యాబేజీ తొక్క లాంటి ఆకారం ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో యూజర్లు అందరూ అవాక్కయ్యారు. పోస్టులో అది ఏంటో తెలుసుకునే ముందు ఆ ఆకారం దేనిదో ఊహించాలని నాసా తన పోస్టులో ప్రస్తావించింది.
దీంతో కొందరు వాల్‌నట్ అని, మరికొందరు క్యాబేజీ తొక్క అని, రావియోలీ అనే పాస్తా ఐటం అని రకరకాల కామెంట్లు చేశారు. అయితే తర్వాత నాసా ఇచ్చిన వివరణ చూసి అవాక్కయ్యారు. క్యాబేజీలా ఆ ఫొటోలో ఉన్నది ఒక అంతరిక్ష వస్తువు (Celestial Body) అని నాసా తన వివరణలో పేర్కొంది. చుట్టూ రంగు రంగుల వలయాలతో అందంగా కనిపించే శని గ్రహం చుట్టూ తిరిగే చందమామే ఈ ఫొటోలో ఉన్న వస్తువని తెలిపింది. దాని పేరు పాన్ అని వెల్లడించింది.
ఇది శని (Saturn) కి ఉన్న ఉపగ్రహాల్లో అత్యంత లోపలికి ఉండే ఉపగ్రహం. శని గ్రహానికి లెక్కలేనన్ని చందమామలు ఉండగా.. వాటిలో ఇప్పటి వరకు 145 చందమామల గురించే మనకు తెలుసు. వాటిలో ఒకటి ఈ పాన్. దీనిని తొలిసారిగా 1990లో వోయజ్ 2 స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఫొటోలను చూసి కనుగొన్నారు. వాల్‌నట్ ఆకారంలో 35-23 కి.మీ. వెడల్పుతో ఈ ఉపగ్రహం ఉంటుంది.
శని చుట్టూ ఉన్న వలయాల్లో అత్యంత లోపలి వలయంలో ఉంటూ ఆ గ్రహం చుట్టూ పరిభ్రమిస్తోంది. వోయజర్ 2 దీనిని కాస్త దూరంగానే ఫొటో తీయగా.. ప్రస్తుతం శని పరిశోధనకు నాసా పంపిన కాసినీ అంతరిక్ష నౌక దీనికి అత్యంత సమీపానికి వెళ్లి రెండు ఫొటోలు తీసింది. ఒకటి పాన్ పైనుంచి మరొకటి దాని కింది భాగం నుంచి వివిధ కోణాల్లో ఫొటోలను తీసి పంపిందని నాసా పేర్కంది.