ఏడు సార్లు ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి.. చరిత్ర సృష్టించిన దినసరి కూలీ
ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడిని.. సాధారణ కూలీ చిత్తుగా ఓడించారు

విధాత: ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడిని.. సాధారణ కూలీ చిత్తుగా ఓడించారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థిపై 5,196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి ఆ సాధారణ కార్మికుడి గురించి తెలుసుకోవాలంటే ఛత్తీస్‌గఢ్ వెళ్లక తప్పదు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని సజా నియోజకవర్గంలో కొన్ని నెలల క్రితం ఈశ్వర్ సాహు కుమారుడిని ముస్లిం వ్యక్తులు కొట్టి చంపారు. సాహూ దినసరి కూలీ కాగా, అతని కుమారుడిని కొట్టి చంపిన నిందితులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాహూ కూడా ఏం చేయలేకపోయాడు.
ఇక ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో.. బీజేపీ ఈశ్వర్ సాహూను దగ్గరకు తీసుకుంది. సజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై సాహూను పోటీకి దింపింది. రవీంద్ర చౌబే సజా నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన కుమారుడిని చంపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సాహూ విరుచుపడ్డాడు.
ఇక ఎన్నికల్లో ఈశ్వర్ సాహూకు సజా నియోజకవర్గ ప్రజలంతా మద్దతు తెలిపి, గెలిపించారు. రవీంద్ర చౌబేపై 5196 ఓట్ల మెజార్టీతో ఈశ్వర్ సాహూ గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేగా సాహూ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈశ్వర్ సాహూకు 1,01,789 ఓట్లు పోల్ కాగా, రవీంద్ర చౌబేకు 96,593 ఓట్లు పోలయ్యాయి.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీ 54 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు 35 స్థానాలను ప్రజలు కట్టబెట్టారు.