ఒకే స్థానానికి తండ్రీకొడుకుల పోటీ.. గెలిచెదేవరో మరి..?
Gujarat Assembly Elections | ఎన్నికలు అంటేనే చిత్ర, విచిత్రమైన రాజకీయాలను చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలను మొదలుకొంటే పార్లమెంట్ ఎన్నికల వరకు కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ చేసిన సందర్భాలను చూశాం. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలను చేయడం చూశాం. అలాంటి సందర్భమే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీకుమారులిద్దరూ పోటీ చేస్తున్నారు. తండ్రేమో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కుమారుడేమో పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. […]

Gujarat Assembly Elections | ఎన్నికలు అంటేనే చిత్ర, విచిత్రమైన రాజకీయాలను చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలను మొదలుకొంటే పార్లమెంట్ ఎన్నికల వరకు కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ చేసిన సందర్భాలను చూశాం. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలను చేయడం చూశాం. అలాంటి సందర్భమే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీకుమారులిద్దరూ పోటీ చేస్తున్నారు. తండ్రేమో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కుమారుడేమో పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. మరి గుజరాత్ సమరంలో గెలిచి నిలిచేది ఎవరో వేచి చూడాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. భరూచ్ జిల్లాలోని జగాడియా అసెంబ్లీ నియోజకవర్గం అది. ఇది ఎస్టీ రిజర్వ్‌డ్. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ ట్రైబల్ పార్టీ (BTP) వ్యవస్థాపక అధ్యక్షుడు ఛోటు వాసవ వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీటీపీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఛోటు వాసవ బరిలో దిగారు. ఇందుకు సంబంధించి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. బీటీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్ వాసవ కూడా జగాడియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనేమో పార్టీ టికెట్‌పై బరిలో దిగారు.
ఈ సందర్భంగా ఛోటు వాసవ మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. జగాడియాలో కానీ, గుజరాత్‌లో కానీ బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. బీజేపీని ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు. ఇక కుమారుడి పోటీపై స్పందిస్తూ.. ఒకే కుటుంబ సభ్యులు నాలుగు స్థానాల నుంచి పోటీ చేయొచ్చని చెప్పారు.
ఇదే అంశంపై ఛోటు వాసవ వ్యక్తిగత కార్యదర్శి అబ్బాలాల్ జాదవ్ కూడా స్పందించారు. స్వతంత్ర అభ్యర్థిగా జగాడియా స్థానానికి ఛోటు వాసవ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయనకు నియోజకవర్గ ప్రజల మద్దతు ఉందన్నారు. తప్పకుండా ఛోటు వాసవ గెలుస్తారని చెప్పారు. ఆయన చివరి శ్వాస వరకు గిరిజనుల హక్కుల కోసం పోరాడుతారని స్పష్టం చేశారు. ఛోటు వాసవ నుంచి జగాడియా నియోజకవర్గాన్ని లాక్కోలేరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సాధారణమే అని చెప్పారు. తండ్రీకొడుకుల మధ్య ఉన్న విబేధాలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.
ప్రస్తుత పరిణామాలపై మహేశ్ వాసవ కూడా స్పందించారు. బీటీపీ అభ్యర్థిగా జగాడియా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలువబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుద్యోగం, జీఎస్టీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తండ్రిపై పోటీ గురించి స్పందిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని సున్నితంగా బదులిచ్చారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్ వాసవ నర్మద జిల్లాలోని దేదియాపాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జగాడియా నుంచి ఛోటు వాసవ గెలిచారు. 2017 ఎన్నికల్లో బీటీపీ నుంచి గెలుపొందింది వీరిద్దరు మాత్రమే. అయితే ఈ సారి దేదియాపాడ నుంచి బీటీపీ తరఫున బహదూర్ సిన్హ్ బరిలో దిగారు.
ఈ ఏడాదిలో మే నెలలో ఛోటు వాసవ ఆప్‌తో చేతులు కలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఛోటు వాసవ భరూచ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ కొన్నాళ్లనే ఆప్‌తో తెగదెంపులు చేసుకున్నారు.