పులిని చుట్టుముట్టి తుపాకీతో కాల్చి చంపిన అట‌వీశాఖ అధికారులు.. వీడియో

పులులు అంటే జ‌నాల‌కు వ‌ణుకు పుడుతోంది. అంత‌టి భ‌యంక‌ర‌మైన క్రూర మృగం ఓ గ్రామంలోకి ప్ర‌వేశించి, జ‌నాల‌పై దాడుల‌కు పాల్ప‌డి భ‌యాన‌క వాతావ‌ర‌ణ సృష్టించింది

  • By: Somu    latest    Feb 26, 2024 12:15 PM IST
పులిని చుట్టుముట్టి తుపాకీతో కాల్చి చంపిన అట‌వీశాఖ అధికారులు.. వీడియో

డెహ్రాడూన్ : పులులు అంటే జ‌నాల‌కు వ‌ణుకు పుడుతోంది. అంత‌టి భ‌యంక‌ర‌మైన క్రూర మృగం ఓ గ్రామంలోకి ప్ర‌వేశించి, జ‌నాల‌పై దాడుల‌కు పాల్ప‌డి భ‌యాన‌క వాతావ‌ర‌ణ సృష్టించింది. పులి సంచారంతో త‌మ నివాసాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు గ్రామ‌స్తులు. జ‌నాల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న ఆ పులిని అట‌వీశాఖ అధికారులు చుట్టుముట్టి తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని తేహ్రీ జిల్లాలో వెలుగు చూసింది. పులిని చంపిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. తేహ్రీ జిల్లాలోని మ‌లేథా గ్రామంలోకి ఓ పెద్ద పులి ప్ర‌వేశించింది. ఇక క‌నిపించిన జ‌నాల‌పై ఆ పులి దాడి చేసి.. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌రిచింది. ఆక‌లితో ఉన్న ఆ పులి గ్రామంలో గాండ్రిస్తూ తిరుగుతూ ఉంటే.. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. పులి సంచారాన్ని దేవ్‌ప్ర‌యాగ్ ఎమ్మెల్యే వినోద్ కందారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న అటవీశాఖ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఇక అట‌వీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చివ‌ర‌కు పెద్ద పులి ఎక్క‌డుందో క‌నుగొనేందుకు అధికారులు డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించారు. ఆ కెమెరాల‌తో పులి క‌ద‌లిక‌ల‌ను గుర్తించి, దాన్ని చుట్టుముట్టారు. గ్రామ స‌మీపంలోకి వ‌చ్చిన పులిపై అధికారులు తుపాకీతో కాల్పులు జ‌రిపారు. దాంతో ఆ పులి చ‌నిపోయింది. పులి ప్రాణాలు విడ‌వ‌డంతో ఎమ్మెల్యే, అధికారులు గ‌ట్టిగా అరిచారు. గ్రామ‌స్తులు ఎమ్మెల్యే, అధికారుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పులిని చంపిన అట‌వీశాఖ అధికారుల‌కు రూ. 11 వేల చొప్పున న‌జ‌రానా ప్ర‌క‌టించారు ఎమ్మెల్యే.