ఆది నుంచీ వంచనే.. ఎప్పుడూ ప్రేక్షక పాత్రే

ఉన్నమాట: బీజేపీ ఎప్పుడూ తెలంగాణ మేలుకోరిన పార్టీ కాదు. ఆది నుంచీ వంచనే. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ రీతిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఏడు లోక్‌సభ స్థానాలను (అందులో తెలంగాణ నుంచి గెలిచినవే నాలుగు), పద్దెనిమిది శాతం ఓట్లను గెల్చుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది కానీ తెలంగాణ ఊసెత్త లేదు. అప్పటి నుంచి బీజేపీ మోసపూరితంగానే వ్యవహరించింది. తెలంగాణ […]

  • By: krs    latest    Oct 01, 2022 5:45 PM IST
ఆది నుంచీ వంచనే.. ఎప్పుడూ ప్రేక్షక పాత్రే

ఉన్నమాట: బీజేపీ ఎప్పుడూ తెలంగాణ మేలుకోరిన పార్టీ కాదు. ఆది నుంచీ వంచనే. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ రీతిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఏడు లోక్‌సభ స్థానాలను (అందులో తెలంగాణ నుంచి గెలిచినవే నాలుగు), పద్దెనిమిది శాతం ఓట్లను గెల్చుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది కానీ తెలంగాణ ఊసెత్త లేదు. అప్పటి నుంచి బీజేపీ మోసపూరితంగానే వ్యవహరించింది.

తెలంగాణ కోసం బరిగీసి చేసిన ఏ ఉద్యమంలోనూ బీజేపీ తెగించి నిలబడలేదు. తెలంగాణకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్లాడుతుంటే బీజేపీ ప్రజా ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డితో దాగుడు మూతలు ఆడుకున్నారు. 2010లో ఆంధ్ర ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాలకు ప్రతిఘటనగా తెలంగాణ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని పిలుపునిస్తే కిషన్‌రెడ్డి అడ్రస్‌ లేకుండా పోయారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకునే దాకా కేంద్ర బీజేపీది ప్రేక్షక పాత్రే. బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన తర్వాతనే బీజేపీ తెలంగాణకు అనుకూలంగా ముందుకు వచ్చింది. కానీ తెలంగాణ వచ్చీ రాగానే ఏడు మండలాలను, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ నుంచీ చీల్చి ఆంధ్రకు దారాదత్తం చేసింది కూడా కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వమే.

నరేంద్రమోడీకి అసలు తెలంగాణ ఇవ్వడమే ఇష్టం లేదని ఆయన ప్రసంగాలన్నీ చెబుతాయి. తల్లిని చంపి పిల్లను బతికించిన వైద్యుని లాగా, కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేసి తెలుగు స్ఫూర్తిని, భాషను, సంస్కృతిని, సంప్రదాయాన్ని చంపింది అన్న పెద్ద మనిషి ఈయనే (2014 ఎన్నికల్లో). పార్లమెంటు తలుపులు మూసి, చర్చ లేకుండానే, పెప్పర్ స్ప్రే ఉపయోగించి తెలంగాణ ఏర్పాటు చేశారని పదే పదే చెబుతున్న పెద్ద మనిషి కూడా నరేంద్ర మోడీయే. ఒక్కసారి కాదు. రెండు సార్లు కాదు. అనేక సార్లు అదే దుగ్ధ.

ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే, ఆ తర్వాత గద్దెనెక్కిన ఈ పెద్ద మనిషి తెలంగాణ ఇచ్చే వాడా? ఎందుకంటే 2014 ఎన్నికల్లో చిన్న రాష్ట్రాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ, 2019 మానిఫెస్టోలో ఆ హామీని ఎత్తివేసింది ఈ పెద్ద మనిషి నాయకత్వంలోనే. తెలంగాణపై ఎంత వ్యతిరేకత అంటే విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయని కొంచెపు బుద్ధి మోదీ బృందానిది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, నియోజకవర్గాల పెంపు, ఐటీఐఆర్ ఏర్పాటు ఏ ఒక్కటీ అమలు కాలేదు.

పైగా తెలంగాణకు కేంద్రం నుంచి రావలసిన నిధులను తగ్గించడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తెలంగాణకు అప్పులు పుట్టకుండా కట్టడి చేయడం, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం, తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగించడం తెలంగాణపై నరేంద్రమోడీ సాగిస్తున్న కక్షపూరిత సాధింపులకు సాక్ష్యాలు. ఇక ఈయన ఇప్పుడు తెలంగాణకు బంగారం పెడతాను, కొండమీది నుంచి చందమామను తెచ్చిస్తాను అంటే ఎవరు నమ్ముతారు?