అవును…జగన్ నా దోస్త్.. బీజేపీతో టీడీపీ పొత్తుపై అసదుద్ధీన్ ఫైర్
ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు

విధాత, హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. గతంలో మోడీని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీతో పొత్తు పెట్టుకున్నాడని విమర్శించారు. ఏపీలో ఎంఐఎం పోటీ చేస్తే జగన్‌కు నష్టం జరుగుతుందని, జగన్ నాకు దోస్త్ అని, ఆయనకు వ్యతిరేకంగా పోటీ ఉండదని ఓవైసీ స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల్లో మైనార్టీలు, గిరిజనులు, అదివాసీలు నిర్ణయాత్మక పాత్ర వహిస్తారని, ఎన్నికల ఫలితాలుఎలా ఉంటుందో మీరే చూడాలన్నారు. ఆయా వర్గాల ఓట్లు టీడీపీ-బీజేపీ కూటమికి పడవన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాజ్‌పేయ్‌కి సపోర్టు చేశానని.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్నామన్నారు. కానీ, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీతో ఉన్నాడని, ఎన్డీఏ నుంచి బయటకి వచ్చాక మోదీని టెర్రరిస్టు అని తిట్టి, మళ్లీ ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకున్నాడని నిలదీశారు. ఇలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.