ఎలక్టోరల్ బాండ్లతో అవినీతిని ప్రభుత్వీకరించారు
బీజేపీ.. దేశంలోనే అత్యంత అవినీతికర పార్టీ అని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లలో అవినీతిని ప్రభుత్వీకరించారని ఆగ్రహం వ్యక్తం

- దేశంలో అత్యంత అవినీతికర పార్టీ బీజేపీ
- రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
జైపూర్: బీజేపీ.. దేశంలోనే అత్యంత అవినీతికర పార్టీ అని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లలో అవినీతిని ప్రభుత్వీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లను వెల్లడించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ జనతాపార్టీ లూటీ ఇప్పుడు దేశం ముందుకు వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని పరిశీలిస్తే.. బీజేపీకి ఈడీ ఒక దోపిడీ శాఖగా పనిచేసినట్టు కనిపిస్తున్నది’ అని గెహ్లాట్ ఎక్స్‌లో ఒక పోస్టులో విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించిన కంపెనీలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లను విరాళాలుగా ఇచ్చాయని, దాంతో వారిపై చర్యలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో సంబంధం కలిగిన కంపెనీల నుంచి కూడా విరాళాలను బీజేపీ తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమని అన్నారు. దేశంలో ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నదని గెహ్లాట్ గుర్తు చేశారు. ‘అవినీతిని ప్రభుత్వీకరించిన బీజేపీ దేశంలోనే అత్యంత అవినీతికర పార్టీగా ఇప్పుడు ముందుకు వచ్చింది. నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా బీజేపీకి కోట్ల కొద్దీ విరాళాలు ఇవ్వడం ఇదే తొలిసారిగా కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు. బీజేపీ ఒత్తిడి వల్లనే ఏ మీడియా సంస్థ కూడా ఎలక్టోరల్ బాండ్లపై చర్చలు నిర్వహించలేదని గెహ్లాట్ ఆరోపించారు. ప్రజలను వాస్తవాలు చెప్పకపోవడం, తప్పుదోవ పట్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ పాల్పడిన ఈ అవినీతి ఇక ఎంతమాత్రం రహస్యంగా ఉండబోదని వ్యాఖ్యానించారు.