BJP: యడ్యూరప్ప లేకుండానే అసెంబ్లీ ఎన్నికలకు

కర్ణాటకలో కషాయ పార్టీకి సవాలే ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి అన్న యడ్డీ ఆయన లేని ఎన్నికలు ఎలా ఉంటాయో! కన్నడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ విధాత: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీ.ఎస్‌. యడ్యూరప్ప ఆ రాష్ట్ర విధాన సభ సమావేశాల్లో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. శాసనసభ్యుడిగా ఇదే తన చివరి ప్రసంగమని, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. అంతేకాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటక […]

  • By: Somu    latest    Feb 23, 2023 11:58 AM IST
BJP: యడ్యూరప్ప లేకుండానే అసెంబ్లీ ఎన్నికలకు
  • కర్ణాటకలో కషాయ పార్టీకి సవాలే
  • ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి అన్న యడ్డీ
  • ఆయన లేని ఎన్నికలు ఎలా ఉంటాయో!
  • కన్నడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

విధాత: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీ.ఎస్‌. యడ్యూరప్ప ఆ రాష్ట్ర విధాన సభ సమావేశాల్లో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. శాసనసభ్యుడిగా ఇదే తన చివరి ప్రసంగమని, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. అంతేకాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.

కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన యడ్యూరప్ప ఆ రాష్ట్రంలో బీజేపీకి ఇప్పటికీ కీలక నేతనే. అందుకే ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి బసవరాజు బొమ్మైని ఆ సీట్లో కూర్చోబెట్టినా యడ్యూరప్ప (Yediyurappa) లేకుండా కర్ణాటకలో కాషాయ జెండా ఎగుర వేయలేమని ఆ పార్టీ అధిష్ఠానికి తెలుసు. అందుకే పార్టీ పెట్టుకున్న 75 ఏళ్ల నిబంధనను పక్కన పెట్టి పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో ఆయనకు చోటు కల్పించిందంటే ఆయన ప్రభావం అర్థం చేసుకోవచ్చు.

సన్నిహితుల్లోనూ ఆవేదన

ఆయనను ముఖ్యమంత్రి పదవి తప్పించిన నాటి నుంచి ఆయన సన్నిహితులే కాదు విపక్ష నేతలు కూడా పార్టీ ఆయనను విస్మరిస్తున్నదని విమర్శిస్తున్నారు. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అయితే యడ్యూరప్ప నాయకత్వాన్ని కాదని కాషాయ పార్టీకి కర్ణాటక ప్రజలు తిరిగి పట్టం కట్ట బెడుతారా? అన్న ప్రశ్నకు ఆ పార్టీలోనే స్పష్టమైన సమాధానం లేదు.

అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెద్ద సవాలే అన్న చర్చ నడుస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా మోడీ-షాల హవా ఇక్కడ పని చేయకపోవచ్చు. జాతీయ పార్టీ అయినా ఇక్కడ యడ్యూరప్పనే కమల దళపతి. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతాను అనగానే కర్ణాటక బీజేపీ (Bharatiya Janata Party (BJP)) నేతలు, కార్యకర్తల్లో కలవరం మొదలైంది.

అందుకే సభలో విపక్ష సభ్యులు కూడా ఢిల్లీ నేతల మాటలు విని పోటీ నుంచి విరమించుకోవద్దని, మీ లాంటి అనుభవజ్ఞుల అవసరం సభకు ఉన్నదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) బలంగా ఉన్నది. ఆ పార్టీని ఎదుర్కొవాలంటే అనుభవం ఉన్న నేత కావాలి. కొంతకాలంగా కర్ణాటక బీజేపీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం బైటికి కనిపించకపోయినా సమసి పోలేదు.

తాజాగా ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు యడ్డీ పునరుద్ఘాటించడంతో ఆయన వారసుడిగా ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మైనే (Basavaraj Bommai) ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తుందా? లేక గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి సీఎం భూపేంద్ర పటేల్‌ పేరు ప్రస్తావించకుండానే అంతా మోడీ అన్నట్టు ఇంకా ఎవరినైనా ముందు పెట్టి ప్రయోగం చేస్తుందా? అన్నది రాబోయే రెండు మూడు నెలల తర్వాత స్పష్టత వస్తుంది.

అయితే తనను సీఎంగా తప్పించిన నాటి నుంచి యడ్యూరప్ప అసంతృప్తితో ఉన్న మాట మాత్రం వాస్తవం. సభలో విపక్షాల విమర్శలను ఆయన కొట్టిపారేసినా ఎన్నికల సమయంలో ఎలా పనిచేస్తారు? అన్నది చూడాలి. యడ్యూరప్ప లేకుండా అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి కూడా కర్ణాటక రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.