విడుదలకు ముందే ‘అవతార్ 2’ ప్రభంజనం.. 160 భాష‌ల్లో విడుద‌ల‌!

13 ఏళ్ల తర్వాత ప్రేక్ష‌కుల ముందుకు అవ‌తార్ సీక్వెల్‌ ఈనెల 16న ఏకంగా 160 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధం అద్భుతమైన రిపోర్ట్స్.. ప్రపంచ సినిమాకి షాకివ్వబోతుందా? విధాత‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు భాషా బేధాలు లేకుండా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవతార్ 2. ఈ చిత్రం టికెట్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అయిన ‘అవతార్’కి సీక్వెల్‌గా ‘అవ‌తార్ 2 - ది వే ఆఫ్ వాటర్’ […]

విడుదలకు ముందే ‘అవతార్ 2’ ప్రభంజనం.. 160 భాష‌ల్లో విడుద‌ల‌!
  • 13 ఏళ్ల తర్వాత ప్రేక్ష‌కుల ముందుకు అవ‌తార్ సీక్వెల్‌
  • ఈనెల 16న ఏకంగా 160 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధం
  • అద్భుతమైన రిపోర్ట్స్.. ప్రపంచ సినిమాకి షాకివ్వబోతుందా?

విధాత‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు భాషా బేధాలు లేకుండా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవతార్ 2. ఈ చిత్రం టికెట్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అయిన ‘అవతార్’కి సీక్వెల్‌గా ‘అవ‌తార్ 2 – ది వే ఆఫ్ వాటర్’ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే.

దాదాపు 13 సంవత్సరాలు తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమా.. రిలీజ్‌కి ముందే వండర్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ కాగా టికెట్లు హాట్‌ కేకుల్లా అయిపోయాయి.

తొలిరోజే రెండు లక్షల మంది టికెట్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆల్ ఇండియాలో ఏడు కోట్ల గ్రాస్ మొదటి రోజు వచ్చింది. ఇప్పటివరకు ఉన్న కేజిఎఫ్ 2, బాహుబలి 2 సినిమాలను సవాల్ చేస్తూ ఆల్ టైం అడ్వాన్స్ బుకింగ్స్‌లో అవతార్ 2 ఒకటిగా నిలిచింది.

ఇక ఇప్పటివరకు అమ్ముడుపోయిన టికెట్స్‌లో సుమారు లక్షకు పైగా కేవలం పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ ‌లో బుక్ చేసుకోవడం గ‌మ‌నార్హం. ఇక అవతార్ టికెట్స్ వీకెండ్ బుకింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. వీకెండ్‌లో సుమారు 4.1 లక్ష‌ల టికెట్లు అమ్ముడుపోయాయి. అది త్వరలో ఐదు లక్షలమందికి చేరుతుంది. వారాంతపు గ్రాస్ 16కోట్లకు చేరింది. మొత్తం మీద సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ 45 కోట్ల నుంచి 80 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మొదటి భాగంలో పండారా గ్రహంలో విహరింపజేసిన గేమ్స్ కామరూన్.. రెండో భాగంలో మనల్ని సముద్ర గర్భంలోకి తీసుకెళ్తున్నాడు. అవతార్ ఐదో భాగం 2028లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ భాగంలో మాత్రం సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచి పని కోసం భూమి పైకి వస్తాయని తెలుస్తోంది.

ఇక అవతార్ 2 రన్ టైం 192 నిమిషాల 10 సెకండ్లు అంటే మూడు గంటల 12 నిమిషాల 10 సెకండ్లు అన్నమాట. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం తగ్గిపోయాయి. రన్ టైం ఎక్కువగా ఉండే బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు త‌మ పంథా మార్చుకొని తక్కువ నిడివి కలిగిన హాలీవుడ్ చిత్రాలను అనుకరిస్తున్నాయి.

కానీ జేమ్స్ కామెరూన్ మాత్రం ‘అవతార్ 2’ కోసం మన పాత చిత్రాలైన మాయాబజార్, లవకుశ వంటి ఎక్కువ నిడివి కలిగిన చిత్రాల వైపు ఆసక్తి చూపడం విచిత్రంగా ఉంది. బహుశా ఆయన మెదడులో ఉన్న మొత్తాన్ని తెరపై చూపించాలంటే ఆ మాత్రం నిడివి కావాలేమో. అలా చేస్తేనే జేమ్స్ కామరూన్ తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చినట్టుగా భావించి ఉంటాడు.

కంటెంట్‌లో దమ్ము లేకుండా మూడు గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టలేరు. కానీ జేమ్స్ కామరూన్ మాత్రం తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు మూడు గంటల పాటు సరికొత్త ప్రపంచంలోకి వెళ్తాడని… నిడివి అనేది తనకు సమస్య కాదని ఆయన బల్లగుద్ది వాదిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో అనే ఎగ్జయిట్‌మెంట్‌ని కలిగించడంలో వందకు వెయ్యి శాతం సక్సెస్ అయింది.

ఇక ఈమూవీ ఈనెల 16న ఏకంగా 160 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేపథ్యంలో అవతార్ 2 సినిమా ప్రీమియర్‌ను లండన్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు, క్రిటిక్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప‌లువురు హాలీవుడ్ సెలబ్రిటీలు, క్రిటిక్స్ సోషల్ మీడియాలో ‘అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్’ గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అవతార్ కంటే ఈ ‘అవ‌తార్ 2’ ఇంకా గొప్పగా, ఎమోషనల్‌గా బాగుందని ఎరిక్ డేవిస్ తెలిపాడు. ఫిలిం మేకర్స్‌కి సినిమాను ఎలా తీయాలో జేమ్స్ కామరూన్ చూపించారు. ఎమోషనల్ పాయింట్, విజువల్స్ పరంగా అవతార్ 2 బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిపారు.

టెక్నికల్‌గా అవ‌తార్ 2 ఓ మాస్టర్ పీస్. అవతార్ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తృతంగా పెరిగింది. జేమ్స్ కెమెరూన్ ఈ మూవీని అగ్ర‌స్థానంలో నిలబెట్టబోతున్నాడని రూట్ టేలర్ వ్యాఖ్యానించాడు. రివ్యూస్ పాజిటివ్‌గా ఉన్నాయ్.. పార్ట్ వన్ కంటే పార్ట్ 2 నెక్ట్స్ రేంజ్‌లో ఉందని తెలుస్తోంది.. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.