Babli Gates Opened| తెరుచుకున్న బాబ్లీ గేట్లు..శ్రీరాంసాగర్ కు గోదావరి పరవళ్లు

Babli Gates Opened| తెరుచుకున్న బాబ్లీ గేట్లు..శ్రీరాంసాగర్ కు గోదావరి పరవళ్లు

విధాత : మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ నీటీ పారుదల అధికారుల సమక్షంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యుసీ) పర్యవేక్షణలో గేట్లను ఎత్తారు. దీంతో బాబ్లీ బ్యారేజీ నుంచి 1టీఎంసీ వరద నీరు దిగువన గోదావరిలో ప్రవహిస్తూ శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) ప్రాజెక్టుకు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని దిగువ ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికీ రాష్టంలో వానలు అంతంత మాత్రంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన కురిసే వర్షాలకు బాబ్లీ నుంచి అయినా వరద శ్రీరామసాగర్‌లోకి చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.