NBK108: పెళ్లి ముహూర్తం రోజే.. బాలయ్య ‘రామారావు గారు’
విధాత: ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సీనియర్ స్టార్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లను ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరిలో నాగార్జున, వెంకటేష్ ఎందుకనో కాస్త స్లోగా సినిమాలు చేస్తున్నారు. కానీ.. చిరంజీవి, బాలయ్యలు స్టార్ హీరోలతో పోటీ పడి మరి తమ సత్తా చాటుతున్నారు ఇంతకాలమైనా, ఇన్నేళ్లయినా తమ క్రేజ్, ఫాలోయింగ్.. ఏ మాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ వద్ద నిరూపిస్తూనే ఉన్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత […]

విధాత: ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సీనియర్ స్టార్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లను ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరిలో నాగార్జున, వెంకటేష్ ఎందుకనో కాస్త స్లోగా సినిమాలు చేస్తున్నారు. కానీ.. చిరంజీవి, బాలయ్యలు స్టార్ హీరోలతో పోటీ పడి మరి తమ సత్తా చాటుతున్నారు ఇంతకాలమైనా, ఇన్నేళ్లయినా తమ క్రేజ్, ఫాలోయింగ్.. ఏ మాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ వద్ద నిరూపిస్తూనే ఉన్నారు.
బాలకృష్ణ విషయానికి వస్తే.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. దీనికి గోపీచంద్ మలినేని దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి చిత్రాలైనా కాస్త క్లాస్‌గా ఉంటాయేమో గాని.. బాలయ్య అంటే ఇక మాస్ ప్రేక్షకులకు జాతరనే చెప్పాలి. అందుకే ఆయనకు గాస్ ఆఫ్ మాసెస్ అని బిరుదు వేస్తున్నారు. ఇక ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా వీడియో కాబోతోంది. ఇదే పోటీలో చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ కూడా ఉంది. ఈ రెండు చిత్రాల పోస్టర్స్, స్టిల్స్, లుక్స్ చూస్తుంటే రెండు ఒకదానికొకటి పోటీనా అనిపించక మానదు.
నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. తాజాగా ఆయన 108వ చిత్రం కూడా తాజాగా ప్రారంభమైంది. నందమూరి వంశానికే చెందిన నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం ‘పటాస్’తో దర్శకుడిగా విజయ పరంపర కొనసాగించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘రామారావు గారు’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అనిల్ రావిపూడి చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో పాటు మాస్ ఇజం కలిసి పంచ్ డైలాగులతో నిండి ఉంటాయి. గతంలో బాలకృష్ణ కూడా ఎన్నో చిత్రాలలో ఇలాంటి పాత్రలు పోషించాడు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య’ చిత్రాలతో పాటు ‘తల్లిదండ్రులు, అనసూయమ్మ గారి అల్లుడు, సీతారామ కళ్యాణం, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం’ వంటి పలు బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి.
కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి పలువురు సీనియర్లతో బాలయ్యతో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి ఘన విజయం సాధించారు. కానీ ఈ మధ్య మాత్రం బాలయ్య అలా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రాలు చేయలేక పోయాడు. చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి అనిల్ రావిపూడి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాల్సి ఉంది.
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న NBK108 చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ఘనంగా ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా.. నిర్మాతలు శిరీష్, మైత్రి మూవీస్ నవీన్ ఎర్నేని స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రంలో బాలయ్యను అనిల్ రావిపూడి ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్. బాలయ్య ఇమేజ్‌కి తగ్గకుండా.. ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ‘అఖండ’తో అరాచకం సృష్టించి.. ‘వీర సింహారెడ్డి’తో విజృంభించ బోతున్న మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే ఈ 108వ చిత్ర ఓపెనింగ్‌కి డిసెంబర్ 8వ తేదీనే ఎంచుకోవడానికి ఓ పెద్ద కారణం ఉంది.
అదేంటంటే.. మూడేళ్ల క్రితం ‘అఖండ’ మూవీకి 2019 డిసెంబర్ 6న పూజ చేశారు. ఇక తాజాగా ఎన్.బి.కె 108వ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్ 8వ తేదీన జరిగింది. సరిగ్గా 40ఏళ్ల కిందట ఇదే రోజున బాలయ్య జీవితంలో ఓ అద్భుతం జరిగింది. అదేంటంటే బాలయ్యకు వసుంధరా దేవితో 1982 డిసెంబర్ 8న వివాహం జరిగింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వెడ్డింగ్ శుభలేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
దీంతో బాలయ్య సెంటిమెంట్ డబులైంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుందని, అలాగే హీరోయిన్గా ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకున్నారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో 12 రోజుల పాటు భారీ జైలు సెట్లో యాక్షన్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది వేసవికి.. ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.